వృద్ధులకు వయసు నిర్ధారణ పత్రాల జారీలో అలసత్వం రెండేళ్లుగా ఎదురు చూపులు జిల్లా వ్యాప్తంగా ఈ పత్రాల కోసం 3733 మంది నిరీక్షణ విడతల వారీగా వస్తే సర్టిఫికెట్లు ఇచ్చేందుకు అభ్యంతరం లేదంటున్న సర్వజన ఆస్పత్రి వైద్యాధికారులు నోరు మెదపని డీఆర్‌డీఏ అధికారులు
జాబితా పంపారు..
గంట్యాడ మండలానికి చెందిన ఆర్.భైరాగి వయసు అరవై ఏళ్లు పైబడి ఉంటుంది. కానీ అతని ఆధార్ కార్డులో వయసు తక్కువగా నమోదైంది. దీంతో వృద్ధాప్య పింఛన్ పొందేందుకు తనకు వయసు నిర్ధారణ పత్రం మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు చేసి రెండేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు అతనికి వయసు నిర్ధారణ పత్రం మంజూరు కాలేదు.
విజయనగరం పట్టణంలోని దాసన్నపేటకు చెందిన కె.సూర్యనారాయణ వయసు అరవై ఏళ్లు పైబడి ఉంటుంది. కానీ అతని ఆధార్ కార్డులో వయసు తక్కువగా నమోదైంది. దీంతో వృద్ధాఫ్య పింఛన్ పొందేందుకు తనకు వయసు నిర్ధారణ పత్రం మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు ఇప్పటి వరకు ఈ ధ్రువీకరణ పత్రం మంజూరు చేయలేదు. ఇంతలోనే
ఈ వృద్ధుడు ఇటీవల మృతి చెందాడు.
విజయనగరం ఫోర్ట్:
అది ఎన్నికల సమయం.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నేతలు ఊరూవాడ.. ఒక్కటిగా 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని గొప్పగా ప్రచారం చేశారు. పింఛన్ మంజూరు సంగతి దేవుడెరుగు.. వృద్ధాప్య వయసు నిర్ధారణ పత్రాలకు కూడా ఇప్పుడు ఏళ్ల తరబడి తిప్పుతున్నారు. ఈ పత్రాల మంజూరులో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి కొందరు వృద్ధులకు 60 ఏళ్లు పైబడి వయసు ఉన్నా.. ఆధార్ కార్డులో తక్కువగా వయసు నమోదు కావడంతో వృద్ధాప్య పింఛన్ మంజూరు కాని పరిస్థితి నెలకొంది. ఇంతలోనే కొందరు వృద్ధులు తనువు చాలిస్తున్నారు. ఆధార్ కార్డులో వయసు తక్కువగా నమోదైతే అటువంటి వారు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో వయసు నిర్ధారణ ధ్రువీకరణ పత్రాలు ఇప్పిస్తామని అధికారులు చెప్పడంతో జిల్లా వ్యాప్తంగా 3733మంది వృద్ధులు దరఖాస్తు చేసుకున్నారు.
రెండేళ్లుగా..
వృద్ధులకు వయసు నిర్ధారణ పత్రాలు మంజూరు చేయడంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీఆర్‌డీఏ అధికారులు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి అధికారులు ఒకరిపై ఒకరు నెపాన్ని నెట్టుకోవడంతోనే కాలం వెళ్లదీస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. గడిచిన రెండేళ్లలో ఒక్కరికి కూడా ఈ ధ్రువీకరణ పత్రం ఇచ్చిన దాఖలాల్లేవు. ఈ విషయమై సర్వజన ఆస్పత్రి అధికారులు అంత మందికి ఒకేసారి వయసు నిర్ధారణ పత్రాలు ఇవ్వలేమని, విడతల వారీగా పంపిస్తే చేస్తామని చెబుతున్నారు. డీఆర్‌డీఏ అధికారులు మాత్రం విడతల వారీగా పంపిస్తామనిగాని, పంపించమనిగాని ఏదీ చెప్పడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ రెండు శాఖల సమన్వయ లోపం వృద్ధుల పాలిట శాపంగా మారిందనే ఆరోపణలున్నాయి. వయసు నిర్ధారణ పత్రాల కోసం వృద్ధులను ఎందుకు పంపించడం లేదని డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసపాణిని ఫోన్‌లో అడిగేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.
వృద్ధుల వయసు నిర్ధారణ ధ్రువీకరణ పత్రాల కోసం 3733 మంది జాబితాను డీఆర్‌డీఏ అధి కారులు అందించారు. అయితే అంత మందికి ఒకేసారి ఈ పత్రాలు ఇవ్వలేం. విడతల వారీగా పంపిస్తే పత్రాలు మంజూరు చేస్తామని చెప్పాం. ఇంత వరకు ఎవరినీ పంపించలేదు.
– డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి


