24న ఉపముఖ్యమంత్రి రాక? | - | Sakshi
Sakshi News home page

24న ఉపముఖ్యమంత్రి రాక?

Jun 7 2026 12:21 AM | Updated on Jun 7 2026 12:21 AM

సాక్షి, పార్వతీపురం మన్యం: బలిజిపేట మండలంలోని పెదపెంకి గ్రామానికి ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఈ నెల 24న వచ్చే అవకాశాలున్నాయి. గ్రామంలో నూతనంగా నిర్మించిన మ్యాజిక్‌ డ్రెయిన్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తానని జిల్లా అధికారులకు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. పెదపెంకి గ్రామంలో అభివృద్ధి పనులపై ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శనివారం సమీక్ష నిర్వహించారు. గ్రామంలో వందకు పైగా ఫైలేరియా కేసులు ఉన్న విషయం విదితమే. తరచూ ప్రజలు ప్రమాదకర జ్వరాల బారిన పడుతుండటంతో గ్రామంపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. గ్రామంలో మురుగునీరు వెళ్లే మార్గాలు సరిగ్గా లేకపోవడంతోపాటు, కొన్నిచోట్ల కాలువలు అక్రమణలకు గురవడాన్ని అధికారులు ఆయనకు వివరించారు. ఆయన సూచనలతో ఆక్రమణలు తొలగించి గ్రామంలో మ్యాజిక్‌ డ్రెయిన్లు నిర్మిస్తున్నారు. రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా పెదపెంకిని తీర్చిదిద్దాలన్న ఆలోచనలో జిల్లా యంత్రాంగం ఉంది. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు 24వ తేదీన వస్తానని పవన్‌ కల్యాణ్‌ జిల్లా అధికారులతో చెప్పారు. అప్పటికి గ్రామంలో పెండింగ్‌ పనులను పూర్తి చేసేందుకు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.

పెదపెంకిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి

పార్వతీపురం: బలిజిపేట మండలంలోని పెదపెంకి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ డా. ఎన్‌. ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెలలో ఉప ముఖ్యమంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకోవాలన్నారు మౌలిక వసతులు, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య సేవలకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ఈనెల 20లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఫైలేరియా నియంత్రణలో కృషిచేసిన అధికారులను కలెక్టర్‌ అభినందించారు. సమావేశంలో ఐటీడీఏ పీఓ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

12 సబ్‌ రేషన్‌ డిపోలు ప్రారంభం

సీతంపేట: సీతంపేట ఏజెన్సీలోని మారుమూల గిరిజన గ్రామాలకు 12 సబ్‌ రేషన్‌ డిపోలు శనివారం ప్రారంభమైనట్లు డీఎస్‌వో బి.అశోక్‌ తెలిపారు. ఈ మేరకు మండలంలోని శిలిగాం గ్రామంలో సబ్‌ రేషన్‌డిపోను ఏఎంసీ చైర్‌పర్సన్‌ సంధ్యారాణి ప్రారంభించారు. మొత్తం 25 సబ్‌డిపోలు మంజూరు కాగా వాటిలో 13 డిపోలు ఘాట్‌రోడ్‌లలో ఉండడంతో వాటికి ఎటువంటి రవాణా సదుపాయాలు లేవని అందుచేత ప్రారంభించలేదన్నారు. ఇప్పటికే ప్రారంభించిన డిపోలకు మెయిన్‌ రేషన్‌ డిపోల నుంచి సరుకులు వ్యాన్‌లు, ఇతర వాహనాల ద్వారా చేరవేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పవన్‌, చంద్రరావు, తహసీల్దార్‌ డి.శ్రీకన్య,ఎంపీడీవో మిశ్రో, జీసీసీ మేనేజర్‌ డి.కృష్ణ, ఆర్‌ఎస్‌డీటీ శ్రీ విద్య తదితరులు పాల్గొన్నారు.

టెట్‌ నిబంధనల్లో మార్పులు చేపట్టాలి

పార్వతీపురం రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) షెడ్యూల్‌, నిబంధనలలో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఏపీటీఎఫ్‌) ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సంఘ రాష్ట్ర కార్యదర్శి నల్లా బాలకృష్ణ, పార్వతీపురం మన్యం జిల్లా బాధ్యులు మహేష్‌, అప్పలనాయుడు శనివారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగ అభ్యర్థుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పరీక్ష ఫీజును పూర్తిగా మినహాయించాలని, లేదంటే తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. పరీక్ష నిర్వహణను ప్రభుత్వ బాధ్యతగా పరిగణించాలే తప్ప, అభ్యర్థుల నుంచి నిధులు సమకూర్చుకునే మార్గంగా చూడకూడదన్నారు. ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు సంబంధించి పలు సవరణలు అవసరమని పేర్కొన్నారు. నూతన అభ్యర్థులకు, ఇన్‌–సర్వీస్‌ టీచర్లకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించాలని, అర్హత మార్కులను తగ్గించాలని కోరారు. 50 ఏళ్లు దాటిన ఉపాధ్యాయులకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష కష్టతరంగా ఉంటుందని, వారికి ఆఫ్‌లైన్‌ ఓఎంఆర్‌ పద్ధతిలో అవకాశం కల్పించాలని విన్నవించారు. స్కూల్‌ అసిస్టెంట్లను మళ్లీ పరీక్ష రాయమనడం సమంజసం కాదని, వారి సర్టిఫికెట్ల చెల్లుబాటును యథాతథంగా కొనసాగించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement