● ‘గ్లోబల్ స్ఫూర్తి’ సొసైటీ లోగో ఆవిష్కరణ
పార్వతీపురం రూరల్: ప్రతి ఒక్కరూ సామాజిక సేవలో భాగస్వాములు కావాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి పిలుపునిచ్చారు. తన కార్యాలయంలో పట్టణానికి చెందిన ’గ్లోబల్ స్ఫూర్తి డెవలప్‌మెంట్ సొసైటీ’ లోగోను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. యువతను తప్పుదోవ పట్టిస్తున్న మత్తు పదార్థాలు, గంజాయి వినియోగం, గ్రామాల్లోని చిల్లంగి వంటి మూఢనమ్మకాలపై స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. సొసైటీ అధ్యక్షుడు బలగ రాధానాయుడు మాట్లాడుతూ.. బాల్యవివాహాల నివారణ, మూఢనమ్మకాల నిర్మూలన, మత్తు పదార్థాల అనర్థాలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు సంస్థను ప్రారంభించినట్లు తెలిపారు. అధికారుల, ప్రజల సహకారంతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం ఎస్పీని సొసైటీ సభ్యులు సత్కరించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు వానపల్లి శంకరరావు, ఎస్.ఎ.బి. లక్ష్మణరావు, ఎస్. వెంకటమహేష్, బి.బాబ్జి రావు పాల్గొన్నారు.


