పార్వతీపురం రూరల్: మండలంలోని వెలగవలసలో చిల్లంగి నెపంతో తాడంగి రమేష్‌ను హత్య చేసిన కేసులో పరారీలో ఉన్న మరో ఐదుగురు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు పార్వతీపురం రూరల్ సీఐ రంగనాథం వివరాలు వెల్ల డించారు. ఇదే కేసులో ఈ నెల 16వ తేదీన 16 మందిని అరెస్టు చేయగా.. మిగిలిన ఐదుగురు నిందితులైన కొండ తామర కామేష్, తాడంగి సుజాత, కడ్రక చామంతి, కొండ గొర్రె సున్నమ్మ, కడ్రక రోజాలను తాజాగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గ్రామంలో శాంతిభద్రతల దృష్ట్యా పోలీసు పికెట్‌ను కొనసాగిస్తున్నట్లు సీఐ తెలిపారు. ఎస్పీ మాధవ్‌రెడ్డి ఆదేశాలు, ఏఎస్పీ పర్యవేక్షణలో గ్రామస్తుల్లో మూఢనమ్మకాలపై అవగాహన కల్పించేందుకు ప్రతిరోజూ ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.
రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని మృతదేహం
విజయనగరం క్రైమ్: విజయనగరం కోరుకొండ రైల్వే స్టేషన్ ల మధ్య, రైల్వే ట్రాక్ మధ్యలో గుర్తు తెలియని మృతదేహాన్ని కనుగొన్నట్లు జీఆర్పీ హెచ్‌సీ శ్రీనివాస్ ప్రసాద్ శుక్రవారం తెలిపారు. మృతుడు సుమారు 5.6 అడుగుల పొడవు, చామనఛాయ రంగు, ముదురు నీలం రంగు షార్ట్ ధరించి ఉన్నాడన్నారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే ఫోన్ 9247585742, 94401 70317 నంబర్లకు తెలియ పరచాలని హెచ్‌సీ ప్రసాద్ కోరారు.
విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి
విజయనగరం క్రైమ్: శ్రీకాకుళం జిల్లా గార మండలం జొన్నలపాడుకు చెందిన యువకుడు రాజాన అశోక్ (18) విద్యుత్ షాక్ తో శుక్రవారం మృతి చెందినట్లు విజయనగరం టూటౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..అంబటి సత్రం వద్ద గల మల్లిక ఎలక్ట్రానిక్ షాప్ లో అశోక్ పని చేస్తున్నాడు. ఇటీవల వీచిన భారీ గాలులకు షాపు బోర్డు ఊడిపోవడంతో మిత్రులతో కలిసి బోర్డును సరిదిద్దే క్రమంలో పక్కనే ట్రాన్స్‌ఫార్మర్‌కు తగలడంతో షాక్ కొట్టి మృతిచెందాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ చెప్పారు.
సాక్షి, పార్వతీపురం మన్యం: గరుగుబిల్లి మండలం తోటపల్లిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి, కోదండ రామస్వామి ఆలయాల్లో ప్రైవేటు వ్యక్తుల పెత్తనానికి అడ్డుకట్టపడింది. ఆలయంలో ప్రైవేట్ కమిటీ ద్వారా విరాళాలు సేకరించడంపై సమగ్ర నివేదిక అందజేయాలని కలెక్టర్ ప్రభాకరరెడ్డి దేవదాయ శాఖ అధికారులకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ కమిటీ వ్యక్తుల ద్వారా విరాళాల సేకరణ, ప్రసాదాల అమ్మకాన్ని నిలిపివేయాలని ఆలయ కార్యనిర్వహణ అధికారికి జిల్లా దేవదాయ శాఖ అధికారి రాజారావు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఉన్నతాధికారుల నుంచి నిర్దిష్ట అనుమతి లేకుండా ఏ ప్రైవేటు కమిటీని కూడా అనుమతించవద్దని ఆదేశించారు.
పద్మ పురస్కారాలకు
నామినేషన్ల ఆహ్వానం
పార్వతీపురం రూరల్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ప్రకటించను న్న పద్మ పురస్కారాలకు అర్హులైన వారి నుంచి నామినేషన్లు, సిఫార్సులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ, సాధికారిత అధికారిణి డా.టి.కనకదుర్గ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర హోం వ్యవహారాల మంత్రి త్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ ఎంపిక ప్రక్రియకు, జిల్లా పరిధిలో మహిళా సాధికారత, శిశు సంక్షేమ రంగాల్లో విశేష సేవలందించిన వ్యక్తుల పేర్లను ప్రతిపాదించవచ్చని పేర్కొన్నా రు. ఆసక్తి గల అభ్యర్థులు లేదా సిఫార్సుదారులు ‘రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్’ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ నామినేషన్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను అప్‌లోడ్ చేయడానికి జూన్ 15, 2026 వరకు గడువు ఉందని, జిల్లాలోని అర్హులైన వ్యక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకో వాలని ఆమె కోరారు.
సీతంపేట: మలేరియా నివారణ చర్యలు చేపడుతున్నట్లు శ్రీకాకుళం డీఎంవో పి.వి.సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు స్థానిక ఏరియా ఆస్పత్రిని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో నమోదువుతున్న జ్వరపీడితుల సంఖ్య, దానిలో మలేరియా పీఎఫ్, పీవీ ఎన్ని అని తెలుసుకున్నారు. ల్యాబ్‌ను పరిశీలించారు. ఇన్‌పేషెంట్లుగా వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వెళ్లి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, సబ్‌యూనిట్ ఆఫీసర్ జె.మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.


