‘అనంత అరణ్య’ం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

‘అనంత అరణ్య’ం ప్రారంభం

Jun 6 2026 12:41 AM | Updated on Jun 6 2026 12:41 AM

పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత

కలెక్టర్‌ డా. ఎన్‌.ప్రభాకరరెడ్డి

గుమ్మలక్ష్మీపురం: అడవులే మానవాళికి అసలైన జీవనాధారమని, పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి సామాజిక బాధ్యత అని కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గుమ్మలక్ష్మీపురం మండలం దొరజమ్ములో జిల్లా నీటియాజమాన్య సంస్థ ఏర్పాటు చేసిన అనంత అరణ్యం మొక్కల పెంపకం కార్యక్రమాన్ని కలెక్టర్‌ శుక్రవారం ప్రారంభించి స్వయంగా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లా అంతటా ఈ ‘అనంత అరణ్య’ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా విస్తృతంగా చేపడుతున్నట్లు ప్రకటించారు. నాటి కాలం నుంచి ప్రకృతిని, చెట్లను పూజిస్తూ వస్తున్నామని, అడవి మనకు తల్లితో సమానమని గుర్తుచేశారు. వైద్యం, పండ్లు, కాయలు ఇలా ప్రతిదీ ప్రకృతి మనకు చెట్ల ద్వారానే ఉచితంగా అందుతున్నాయన్నారు. అయితే, మారుతున్న కాలంతో పాటు రకరకాల కారణాల వల్ల అడవులు, చెట్ల సంఖ్య తగ్గిపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. పూర్వం దొరికిన ఎన్నో రకాల పండ్లు ఇప్పుడు లభించడం లేదని, నేటి తరం రోగాల బారిన పడకుండా ఉండాలంటే రంగురంగుల పండ్లు, కూరగాయలను నేరుగా ఆహారంగా తీసుకోవాలని సూచించారు.

బహుళ అంచెల సాగు అవలంబించాలి

అలాగే రైతులు తమ పొలాల్లో కేవలం ఒకే రకమైన జీడి తోటలు లేదా మామిడి తోటలు వేయడం కంటే, బహుళ అంచెల సాగు విధానాన్ని అవలంబించాలని కలెక్టర్‌ సూచించారు. ఒకే పొలంలో పెద్ద చెట్లు, వాటికంటే చిన్నవి, ఇంకా చిన్న రకం చెట్లను వివిధ అంచెలుగా నాటుకోవాలని వివరించారు. జూన్‌ నెలలో వర్షాల కారణంగా దోమల వ్యాప్తి, మలేరియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, కావున ముందస్తుగానే దోమల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే 1,032 గ్రామాల్లో దోమల నియంత్రణ స్ప్రేయింగ్‌ కార్యక్రమాన్ని రెండు విడతల్లో చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. జిల్లాలో ఒక్క మలేరియా కేసు నమోదైనా.. వైద్య సిబ్బందితో పాటు అన్ని శాఖల అధికారులు ఆ గ్రామానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టనున్నారన్నారు. కార్యక్రమంలో ఐటీడీఎ ప్రాజెక్ట్‌ అధికారి పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖాధికారి ఎం.శ్యామల, జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి ఎ.విజయశాంతి, ఇతర స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement