4.5 కిలోల కణితి తొలగింపు | - | Sakshi
Sakshi News home page

4.5 కిలోల కణితి తొలగింపు

Jun 5 2026 12:54 AM | Updated on Jun 5 2026 12:54 AM

మహారాణిపేట (విశాఖ): కేజీహెచ్‌లో వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన టి.రజని ఏడాది కాలంగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ గత నెల 14న కేజీహెచ్‌ యూరాలజీ విభాగంలో చేరారు. పరీక్షల అనంతరం ఆమె కడుపులోని అడ్రినల్‌ గ్రంథిలో కుడివైపు 6 సెం.మీ, ఎడమవైపు 28 సెం.మీ మేర కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. లక్ష మందిలో నలుగురికి మాత్రమే వచ్చే ‘బైలాటరల్‌ అడ్రినల్‌ మైలోలిపోమా విత్‌ కంజెనిటల్‌ అడ్రినల్‌ హైపర్‌ప్లాసియా’ అనే అరుదైన వ్యాధిగా దీనిని నిర్ధారించారు. యూరాలజీ విభాగాధిపతి డాక్టర్‌ చంద్రశేఖర్‌ పర్యవేక్షణలో, ఎండోక్రినాలజీ, అనస్తీషియా విభాగాల సహకారంతో గత నెల 19న రజనికి శస్త్రచికిత్స చేసి కడుపులో ఉన్న 4.5 కిలోల భారీ కణితను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో గురువారం డిశ్చార్జ్‌ చేసినట్లు కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఐ.వాణి తెలిపారు. విజయవంతంగా శస్త్రచికిత్స చేసిన డాక్టర్‌ చంద్రశేఖర్‌, అనస్తీషియా వైద్యులు కె.శ్రీలక్ష్మి, శరత్‌ చంద్ర, అప్పలరాజు, వెంకటకృష్ణ, దత్తాత్రేయ బృందాన్ని సూపరింటెండెంట్‌ అభినందించారు.

జులై 1న డీఈఈ సెట్‌

ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామకృష్ణారావు

నెల్లిమర్ల: డిప్లొమో ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(డీఈఈ సెట్‌) జులై 1వ తేదీన జరుగుతుందని వేణుగోపాలపురం ప్రభుత్వ డైట్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రామకృష్ణారావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ నెల 11 నుంచి తమ హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని చెప్పారు. జులై 4న ఫలితాలు వెలువడతాయన్నారు. 10 నుంచి 15వ తేదీ వరకు వెబ్‌ ఆప్షనన్‌ కోసం అవకాశం ఉంటుందన్నారు. 16న సీట్ల కేటాయింపు, 19 నుంచి 23 వరకు ధ్రువీకరణపత్రాల పరిశీలన ఉంటుందని ప్రిన్సిపాల్‌ పేర్కొన్నారు. 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు.

ఫుట్‌బాల్‌ ఏపీ జట్టు కెప్టెన్‌గా నవీన్‌

విజయనగరం అర్బన్‌: జాతీయ స్థాయి ఫుట్‌బాల్‌ పోటీలకు ఆంధ్రప్రదేశ్‌ జట్టు కెప్టెన్‌గా స్థానిక సత్య డిగ్రీ/ పీజీ కళాశాల విద్యార్ధి పి.నవీన్‌ ఎంపికయ్యాయడని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎంవీసాయిదేవ మణి తెలిపారు. అనంతపురం జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ‘స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ లీగ్స్‌’ రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో నవీన్‌ అద్భుతమైన ఆటతీరు కనబరిచి విజేతగా నిలిచాడు. త్వరలో జెంషెడ్‌పూర్‌లో జరగబోయే జాతీయ స్థాయి ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్‌ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో గురువారం జరిగిన కార్యక్రమంలో నవీన్‌ను కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.శశిభూషణ్‌రావు, కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎంవీసాయిదేవ మణి, కళాశాల అధ్యాపక బృందం అభినందించారు.

రేపటి నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ప్రాక్టికల్‌ పరీక్షలు

విజయనగరం అర్బన్‌: జిల్లాలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ప్రాక్టికల్‌ పరీక్షల కాలపట్టిను ఆర్‌ఐఓ ఎస్‌.తవిటినినాయుడు విడుదల చేశారు. ప్రభుత్వ జూనియర్‌ కాళాశాలలో ప్రధాన పరీక్ష కేంద్రంగా నిర్దేశిస్తూ జనరల్‌, ఒకేషనల్‌, ఇతర సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీలను ప్రకటించారు. జనరల్‌ కోర్సుల ప్రాక్టికల్స్‌ షెడ్యూల్‌లో ఈ నెల 7న బోటనీ, 8న జువాలజీ, 8, 9 తేదీల్లో ఫిజిక్స్‌, 9, 10 తేదీల్లో కెమిస్ట్రీ ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. వొకేషనల్‌ కోర్సుల షెడ్యూల్‌లో ఈ నెల 7, 8 వ తేదీల్లో వొకేషనల్‌ గ్రూపులు, 10, 11 తేదీలలో వొకేషనల్‌ బ్రిడ్జి కోర్సులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వొకేషనల్‌ ప్రాక్టికల్‌ పరీక్షల కేంద్రాలు కొత్తవలస ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఎస్‌.కోట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, గుర్ల కేజీబీవీ, గజపతినగరం శ్రీకృష్ణజూనియర్‌ కళాశాల ప్రాంతాల్లో నిర్వహిస్తారు. ఈ నెల 6న ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌, 12న ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వేల్యూస్‌ సబ్జెక్టుల పరీక్ష ఉంటాయని తెలిపారు. విద్యార్ధులందరూ తమ హాల్‌ టికెట్లలో కేటాయించిన సమయం ప్రకారం, ఆయా పరీక్ష కేంద్రాలకు సకాలంలో హాజరై పరీక్షలు రాసుకోవాలని ఆర్‌ఐఓ కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement