అక్రమ రిజిస్ట్రేషన్‌కు బ్రేక్‌ | - | Sakshi
Sakshi News home page

అక్రమ రిజిస్ట్రేషన్‌కు బ్రేక్‌

Jun 4 2026 5:10 AM | Updated on Jun 4 2026 5:10 AM

అక్రమ రిజిస్ట్రేషన్‌కు బ్రేక్‌

సాలూరు డగ్లస్‌ అసోసియేషన్‌ భూములపై వివాదం.. వెబ్‌ల్యాండ్‌లో ‘డిస్ప్యూట్‌’గా నమోదు చేయాలని ఆదేశాలు అక్రమ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లపై ఫిర్యాదు.. తుది విచారణ పూర్తయ్యే వరకు యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశం

సాక్షి, పార్వతీపురం మన్యం:

సాలూరులోని డగ్లస్‌ ఎడ్యుకేషనల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు చెందినట్లు చెబుతున్న 3.14 ఎకరాల భూమి అక్రమ రిజిస్ట్రేషన్‌కు జిల్లా యంత్రాంగం చెక్‌ పెట్టింది. రూ.కోట్ల విలువైన భూమిని రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ నిబంధనలను ఉల్లంఘించి ప్రైవేటు వ్యక్తుల పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్లు నిర్వహించారనే ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టారు. వ్యవహారంపై తుది నిర్ణయం వెలువడే వరకు భూమిని వెబ్‌ల్యాండ్‌ వివాదాల రిజిస్టర్‌లో నమోదు చేయడంతో పాటు ఎలాంటి రిజిస్ట్రేషన్లు, ఉపవిభజనలు, మార్పులు, ఇతర లావాదేవీలు జరగకుండా యథాతథ స్థితి కొనసాగించాలని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది.

రూ.కోట్ల విలువైన భూమి స్వాహాకు యత్నం

సాలూరు రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్‌ 175/1లో ఉన్న 3.14 ఎకరాల భూమి స్వాహాకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు జరిగిన విషయం విదితమే. తప్పుడు పత్రాలతో రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్‌ చేశారని.. దానిననుసరించి ఆగమేఘాల మీద సాలూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేశారని పట్టణానికి చెందిన న్యాయవాది రేగు మహేష్‌ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. రెవెన్యూ రికార్డులను సరిచేసి, అక్రమ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లను రద్దు చేయాలని కోరారు. అక్రమ మ్యుటేషన్‌, రిజిస్ట్రేషన్‌ వ్యవహారంపై పత్రికల్లోనూ కథనాలు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌ కూడా దీనిపై విచారణ నిర్వహించి నివేదిక సమర్పించారు. రూ.కోట్ల విలువైన ఆ భూముల అక్రమ రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో రెవెన్యూ, రిజిస్ట్రార్‌ అధికారుల సంపూర్ణ సహకారం ఉందన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. స్థానిక టీడీపీ నేతల ప్రోత్సాహంతోనే ఇదంతా సాగిందని వినిపించింది.

ఉన్నతాధికారుల ఆదేశాలతో కదిలిన రెవెన్యూ యంత్రాంగం

ఉన్నతాధికారుల ఆదేశాలతో సాలూరు రెవెన్యూ యంత్రాంగం కదిలింది. విచారణ జరిపి నివేదికను సమర్పించారు. సాలూరు తహసీల్దార్‌ సమర్పించిన నివేదిక ప్రకారం.. సర్వే నంబర్‌ 175/1లోని 3.14 ఎకరాల రైత్వారీ డ్రై భూమి మొదట ఎస్‌ఎఫ్‌ఏ రికార్డుల ప్రకారం పడాల రామయ్య పేరుతో నమోదై ఉంది. అనంతరం 1978లో నమోదైన డాక్యుమెంట్‌ నంబర్‌ 1035 ఆధారంగా ‘ది డగ్లస్‌ ఎడ్యుకేషనల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌’ భూమిని కొనుగోలు చేసినట్లు సంబంధిత వ్యక్తులు చెబుతున్నారు. 2024లో అసోసియేషన్‌ అధ్యక్షుడి పేరు మీద, ఆ తర్వాత జోసెఫ్‌ డేనియల్‌ గోడే వ్యక్తిగత పేరు మీద మ్యుటేషన్‌ ప్రక్రియ చేపట్టినట్లు తహసీల్దార్‌ నివేదికలో వెల్లడైంది. ఈ సమయంలో చెల్లుబాటు అయ్యే సొసైటీ రికార్డులు, ఇతర ఆధార పత్రాలు సమర్పించలేదని, రిజిస్టర్డ్‌ సొసైటీ పేరిట ఉన్న భూమిని వ్యక్తిగత పేరుకు మ్యుటేషన్‌ చేయడం నిబంధనలకు విరుద్ధమని అప్పటి అధికారులు అభిప్రాయపడినట్లు నివేదికలో పేర్కొన్నారు. దీంతో ప్రారంభ దశలో డిజిటల్‌ సంతకం నిలిపివేసినట్లు సమాచారం. తదనంతరం అసోసియేషన్‌ పేరు మీద మ్యుటేషన్‌ పూర్తయ్యాక మరిన్ని లావాదేవీలకు అనుమతులు లభించినట్లు గుర్తించారు. 2026 మే 16న సర్వే నంబర్‌ 175/1తో పాటు దాని ఉపవిభాగాల్లోని 1.655 ఎకరాల భూమికి సంబంధించి ప్రైవేట్‌ వ్యక్తుల పేరిట అమ్మకపు లావాదేవీలు జరిగాయని, వాటి ఆధారంగా రెవెన్యూ రికార్డుల్లో ఆటో మ్యుటేషన్లు నమోదైనట్లు ఆరోపణలు వచ్చాయి.

●ఈ నేపథ్యంలో భూమి యాజమాన్యంపై వివాదం నెలకొనడంతో పాటు రెవెన్యూ రికార్డుల్లో పరస్పర విరుద్ధ నమోదులు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ప్రాథమికంగా జరిగిన మ్యుటేషన్లు, రిజిస్ట్రేషన్ల చట్టబద్ధతపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వ్యవహారంపై సవివర విచారణ అవసరమని భావించారు.

●దీంతో జిల్లా సంయుక్త కలెక్టర్‌ ఆదేశాల మేరకు.. సర్వే నంబర్‌ 175/1లోని 3.14 ఎకరాల భూమిని వెబ్‌ల్యాండ్‌ వివాదాల రిజిస్టర్‌లో నమోదు చేయాలని నిర్ణయించారు. తుది ఉత్తర్వులు వెలువడే వరకు సంబంధిత భూములపై ఎలాంటి రిజిస్ట్రేషన్లు, ఉపవిభజనలు, మార్పులు, ఇతర లావాదేవీలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సాలూరు తహసీల్దార్‌, సబ్‌–రిజిస్ట్రార్‌లకు సూచించారు. తుది నిర్ణయం వచ్చే వరకు అన్ని రెవెన్యూ రికార్డుల్లో యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement