● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్
రేగిడి: వెన్నుపోటు పదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చిరునామాగా నిలిచారని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ విమర్శించారు. చంద్రబాబు ప్రభు త్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటుపొడిచారన్నారు. రేగిడి మండలం లక్ష్మీపురంలో ఓ కార్యక్రమానికి బుధవారం హాజరైన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. సూపర్‌సిక్స్‌లో ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని, రాష్ట్రంలో ప్రజలను మోసగించారని ఆరోపించారు. ఆడబిడ్డ నిధి రాలేదని, యువతకు ఉద్యోగాలు లేవని, నిరుద్యోగ భృతిని ఎగ్గొట్టారని, రైతులకు రూ.20 వేలు పెట్టుబడి సాయం అటకెక్కిందని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందజేయడంలేదని, 50 సంవత్సరాలకే పింఛన్ హామీ ఎండమావిగా మారిందని, కార్పొరేషన్ రుణాల మంజూరు జాడ కనిపించడంలేదని ఆరోపించారు. మహానాడు పేరుతో చంద్రబాబు సభలు పెట్టుకోవడమే తప్ప రెండేళ్లలో రాష్ట్రానికి, ప్రజలకు చేసిన మేలు శూన్యమన్నారు. అమరావతి పేరుతో అప్పులుచేసి కమీషన్ల రూపంలో లూటీ చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబునాయుడు రెండేళ్ల మోసకారి పాలనపై వైఎస్సార్‌సీపీ పోరుబాట సాగిస్తుందన్నారు.


