పగబట్టిన మూఢత్వం.. పల్లెల్లో మరణ శాసనం! | - | Sakshi
Sakshi News home page

పగబట్టిన మూఢత్వం.. పల్లెల్లో మరణ శాసనం!

Jun 3 2026 12:33 AM | Updated on Jun 3 2026 12:33 AM

వేడుకున్నా వదలలేదు..

ప్రధాన కారణాలివీ...

అనుమానం.. అపోహ.. ప్రాణాలు తీస్తున్న మూఢనమ్మకం

గిరిజన గ్రామాల్లో వీడని చిల్లంగి, చేతబడుల భయం

సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్‌ :

జిల్లాలో చిల్లంగి ఆరోపణల నేపథ్యంలో వ్యక్తిని హత్య చేయడం.. మరోసారి మూఢనమ్మకాల అంశం చర్చనీయాంశంగా మారింది. ఆధునిక సాంకేతికత, విద్య అందుబాటులోకి వచ్చినా.. ఏజెన్సీలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ చేతబడి, క్షుద్రపూజలు, చిల్లంగి వంటి నమ్మకాలు పూర్తిగా అంతరించిపోలేదనే వాస్తవాన్ని ఈ ఘటన గుర్తు చేస్తోంది. గతంలోనూ మక్కువ, పాచిపెంట, కురుపాం ప్రాంతాల్లో చిల్లంగి ఆరోపణలతో అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు సంచలనం సృష్టించాయి. అనారోగ్యం, ఆకస్మిక మరణాలు, పంట నష్టాలు, కుటుంబ సమస్యలకు కొందరిని బాధ్యులుగా చూపుతూ వారిపై దాడులకు దిగిన సందర్భాలు ఉన్నాయి.

చట్టాలు కఠినంగా ఉన్నా..

వ్యవస్థలు అవగాహన కల్పిస్తున్నా...

ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో విద్యా లోపం, ఆరోగ్య సమస్యలపై అవగాహన లేకపోవడం, సంప్రదాయ నమ్మకాల ప్రభావం వంటి కారణాలతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అనారోగ్యాలు లేదా అనూహ్య మరణాలకు వైద్య కారణాలు తెలుసుకునే బదులు కొందరు వ్యక్తులపై చిల్లంగి ముద్ర వేయడం విషాదాలకు దారి తీస్తోంది. గత ఘటనల్లో కోర్టులు కఠిన శిక్షలు విధించినప్పటికీ, మూఢనమ్మకాల నిర్మూలన కోసం వ్యవస్థలు అవగాహన కల్పిస్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదు. మన్యం ప్రాంతంలో చిల్లంగి నెపంతో జరిగిన ఘటనలు కేవలం నేర సంఘటనలు మాత్రమే కాకుండా, సమాజంలో ఇంకా మిగిలి ఉన్న అజ్ఞానానికి అద్దం పడుతున్నాయని సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఇంట్లో ఉన్న మా ఆయనను ఈడ్చుకొని వెళ్లారు. చిల్లంగి చేస్తున్నారని ఆరోపించారు. నిరూపించండి అని అడిగాను. కాళ్లు పట్టుకుని బతిమిలాడాను. ఎక్కడ ఒట్టు వేయాలన్నా వచ్చి వేస్తా అని చెప్పాను. వినలేదు. పిల్లల ముఖం చూసి వదిలేయండని ప్రాథేయపడ్డాను. ఈడ్చుకొని వెళ్లి కొట్టి చంపేసి, కాల్చి వేశారు.

– సృజన, వెలగవలస మృతుడు రమేష్‌ భార్య

పార్వతీపురం మండలం వెలగవలస గ్రామంలో చిల్లంగి నెపంతో గ్రామస్తులు రమేష్‌ అనే యువకుడిని హత్య చేసి, మృతదేహాన్ని తగలబెట్టడం కలకలం రేపింది. గతంలో రమేష్‌ తండ్రిని కూడా చిల్లంగి నెపంతో గ్రామస్తులు ఊరి నుంచి తరిమివేశారు. దీంతో ఆయన ఎక్కడో దూరంగా తల దాచుకుంటున్నాడు.

కొన్నేళ్ల కిందట మక్కువ మండలంలో అప్పన్న అనే వ్యక్తిని ‘చేతబడి’నెపంతో గ్రామస్తులే హత్య చేశారు. మరో సందర్భంలో ఇదే మండలానికి చెందిన దంపతులపై చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో కొంతమంది దాడి చేశారు. సాలూరు ఏజెన్సీ పరిధిలో కూడా చేతబడి నెపంతో ఒకరిపై గొడ్డలితో దాడి చేసిన తీవ్ర ఉదంతం చోటు చేసుకుంది.

పాచిపెంట మండలంలో కొర్రు ముగయ్యను చిల్లంగి చేస్తున్నాడనే ఆరోపణలతో ఇద్దరు వ్యక్తులు హత్య చేశారు.

కొన్నాళ్ల క్రితం జియ్యమ్మవలస మండలంలోని ఒక గిరిజన గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై గ్రామస్తులు చిల్లంగి నెపంతో దాడి చేశారు. గ్రామంలో వరుసగా కొందరు అనారోగ్యానికి గురికావడానికి ఆ కుటుంబమే కారణమని భావించి, రాత్రి వేళ వారి ఇళ్లపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.

గ్రామాల్లో ఎవరికై నా వింత జబ్బులు తగ్గకపోయినా, పశువులు చనిపోయినా, వరుసగా కీడు జరిగినా.. దానికి కారణం ఎవరో చేతబడి (చిల్లంగి) చేయడమేనని స్థానికులు నమ్ముతుంటారు. ఈ క్రమంలో అనుమానితులపై భౌతికదాడులు చేయడం, గ్రామ బహిష్కరణలు, కొన్ని తీవ్ర సందర్భాల్లో హత్యలకు కూడా దారితీసిన ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి.

విద్యావంతుల శాతం తక్కువగా ఉండడం, ఆరోగ్య సమస్యలపై శాసీ్త్రయ అవగాహన లేకపోవడం వల్ల ఇటువంటి నమ్మకాలు బలంగా నాటుకుపోతున్నాయి.

కొన్ని సందర్భాల్లో ఆస్తి తగాదాలు, పాత కక్షలను మనసులో పెట్టుకుని, ప్రత్యర్థులపై ‘చేతబడి’ ముద్రవేసి గ్రామస్తులను వారిపైకి ఉసిగొల్పేలా చేస్తుంటారు.

Advertisement
 
Advertisement
Advertisement