గడపకో రోగి.. ఇంటికో వ్యథ | - | Sakshi
Sakshi News home page

గడపకో రోగి.. ఇంటికో వ్యథ

Jun 3 2026 12:33 AM | Updated on Jun 3 2026 12:33 AM

గడపకో రోగి.. ఇంటికో వ్యథ

రమేష్‌ను మంటల్లో వేసి తగులబెట్టిన దృశ్యం

సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్‌: పార్వతీపురం మండలం వెలగవలస గ్రామంలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. గడపకో రోగి.. ఇంటికో వ్యథ.. ఎక్కడ చూసినా ఇదే స్థితి. పదుల సంఖ్యలోనే ఇళ్లు ఉండే గిరిజన పల్లెలో రెండు నెలలుగా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అంతుచిక్కని కలవరం.. అంతులేని భయం. జ్వరం, జలుబు, దగ్గుతో పాటు రోగుల్లో వింత ప్రవర్తన. ఒక్కసారిగా పెద్ద అరుపులు.. వెర్రి చూపులు.. కాళ్లు, చేతులు కొట్టుకుంటూ ఒళ్లు గగుర్పాటుకు గురిచేసేలా చేష్టలు. అసలే మూఢ నమ్మకాలను బలంగా నమ్మే గిరిజనులు. ఆకులు, అందుబాటులో దొరికిన మందులతో వైద్యం చేస్తున్నారు. దెయ్యం పట్టిందని ఒకరు.. చేతబడి చేశారని ఇంకొకరు.. ఆ భయంతోనే గ్రామానికి చెందిన తాడంగి రమేష్‌(30) ను సోమవారం సాయంత్రం గ్రామస్తులంతా తీవ్రంగా కొట్టి గాయపరిచారు. చేతబడి చేస్తున్నాడని, అందువల్లే గ్రామంలో ఉన్నవారంతా వింతగా ప్రవర్తిస్తున్నారని అనుమానించారు. అక్కడితో వారి కోపం చల్లారలేదు. మంత్ర శక్తులు ఉన్నాయని కాళ్లు, చేతులు వేరు పడేసినట్లు సమాచారం. చనిపోయాక మృతదేహాన్ని మంటల్లో తగులబెట్టారు. సోమవారం రాత్రితో పాటు, మంగళవారం కూడా పోలీ సులు అక్కడికి చేరుకుని విచారణ జరిపారు.

ఊరిలోనే చికిత్స..

గ్రామానికి చెందిన చాలామంది అనారోగ్యంతో బాధ పడుతున్నా.. ఏ ఒక్కరూ ఆస్పత్రిని ఆశ్రయించడం లేదు. పసరమందులు, మంత్రాల వైద్యంతో కాలం వెళ్లదీస్తున్నారు. వింత వ్యాధితో బాధపడుతున్న యువతి కడ్రక బంగారమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. వ్యాధి నిర్ధారణ కావాల్సి ఉంది. వైద్య నిపుణులు, అధికారులు గ్రామాన్ని సందర్శించి ప్రజలకు అవగాహన కల్పించాలని గిరిజనులు కోరుతున్నారు.

16 మంది నిందితుల అరెస్టు

చేతబడి చేస్తున్నాడనే నెపంతో రమేష్‌ను సజీవ దహనం చేసిన ఘటనలో 16 మందిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఆధునిక కాలంలోనూ ఇలాంటి అపోహలతో ప్రాణాలు తీయడం దారుణమని, గుంపుగా దాడి చేసినా ప్రతి ఒక్కరినీ గుర్తించి క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ మనీషారెడ్డి స్పష్టంచేశారు.

వెలగవలసలో ఏం జరుగుతోంది?

ప్రతి ఇంటిలోనూ వింత ప్రవర్తనతో గిరిజనులు

భయాందోళనలో గ్రామస్తులు

చేతబడి నెపంతో వ్యక్తి హత్య

Advertisement
 
Advertisement
Advertisement