ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయం | - | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయం

Jun 3 2026 12:33 AM | Updated on Jun 3 2026 12:33 AM

పార్వతీపురం రూరల్‌: జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకర రెడ్డి వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలకు పలు కీలక సూచనలు చేశారు. ప్రతిరోజూ హెల్త్‌ డైలీ రిపోర్టులు సమర్పించాలని, సీజనల్‌ వ్యాధులు, అంటువ్యాధులు, అసాధారణ మరణాలు, బాల్య వివాహాలు, టీనేజ్‌ గర్భాలను వెంటనే గుర్తించి నివేదించాలని సూచించారు. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న వారిని ఉన్నత ఆస్పత్రులకు రిఫర్‌చేసి సమాచారం అందించాలని ఆదేశించారు. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య అవగాహన పెంపొందించడంతో పాటు మలేరియా, డెంగీ, క్షయ, ఎయిడ్స్‌ వంటి వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి ఇంటి వద్ద ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తల వివరాలు ప్రదర్శించాలని, హోమియోపతి రోగనిరోధక మందులు పంపిణీ చేయాలని సూచించారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, హైరిస్క్‌ గర్భిణులను గుర్తించి పర్యవేక్షించాలని, 100 శాతం టీకాలు పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ ఆరోగ్య పరిశుభ్రత, పోషణ కమిటీలతో కలిసి గ్రామ ఆరోగ్య ప్రణాళికలు రూపొందించి, వీహెచ్‌ఎన్‌డీఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఎంహెచ్‌ఓ పి.భాస్కరరావు, వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

పెదగైశిల సమీపంలో ఏనుగులు

మక్కువ: మండలంలోని ఏజెన్సీ ప్రాంతమైన పెదగైశిల సమీపంలో నాలుగు రోజులుగా గజరాజుల గుంపు సంచరిస్తోంది. అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఏనుగుల జాడను గమనిస్తూ స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు. ఎస్‌.పెద్దవలస, కాకువానివలస, వీరాడవలస, కవిరివలస, బట్టివలస గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు దండోరా వేయించారు.

ఏకలవ్య ప్రిన్సిపాల్‌ నియామకంపై వివాదం

సాక్షి, పార్వతీపురం మన్యం: కురుపాం ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపాల్‌గా రాధాకృష్ణ నియామకంపై గిరిజన సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయనను తక్షణమే వెనక్కి పంపాలని డిమాండ్‌ వినిపిస్తోంది. రాధాకృష్ణ గతంలో కొమరాడ గిరిజన గురుకుల బాలుర పాఠశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసేవారు. అప్పట్లో ఆయన వ్యవహారశైలి పట్ల అనేక ఆరోపణలొచ్చాయి. అధికారులను తప్పుదోవ పట్టించి పాఠశాలలో చదువు వాతావరణాన్ని పోగొట్టారని.. నిబంధనలకు విరుద్ధంగా బాలికల పాఠశాలలో పనిచేసే మహిళా ఉపాధ్యాయులను తాను ఉన్న బాలుర పాఠశాలలో నియమించుకున్నారన్న విమర్శలున్నాయి. గతంలో జోగింపేట ప్రతిభ పాఠశాలలో పనిచేసిన సమయంలోనూ అన్యాయంగా ఒక గిరిజన యువతిని ఉద్యోగం నుంచి తొలగింపునకు కారణమయ్యారని గిరిజన సంఘాలు గుర్తు చేస్తున్నాయి. ఇప్పటికే తీవ్ర వివాదాల్లో ఉన్న కురుపాం గిరిజన ఏకలవ్య పాఠశాలకు ఇటువంటి వివాదాస్పద ఉద్యోగిని ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఇంటర్‌ వరకు బాలికలే ఉంటారని, అక్కడ అటువంటి వ్యక్తి ప్రిన్సిపాల్‌గా ఉంటే విద్యా ప్రమాణాలు నాశనం అవుతాయని, చదువుకునే వాతావరణం కలుషితమవుతుందని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్‌ కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కురుపాం ఏకలవ్య పాఠశాలలో జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా ఈ పాఠశాలకు మహిళా ప్రిన్సిపాల్‌ అవసరం ఉందని.. ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement