వీరఘట్టం: పెళ్లయిన నాలుగేళ్లకే భర్త చనిపోయిన దుఃఖాన్ని భార్య, ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న కుమారుడు చనిపోయాడనే బాధను తల్లిదండ్రులు దిగమింగారు. చిరంజీవిగా జీవించాలన్న పెద్దమనసుతో బ్రెయిన్‌డెడ్ అయిన సోమేశ్వరరావు అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. బుధవారం ఉదయం అవయవదానం చేసేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీతంపేట మండలం చాకలిగూడకు చెందిన సవర సోమేశ్వరరావు(31) వీరఘట్టం మండలం తెట్టంగిలో జూనియర్ లైన్‌మెన్‌గా గత రెండేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. గతనెల 31న గ్రామంలో ఓ విద్యుత్ స్తంభంపై పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడిపోయిన విషయం తెలిసిందే. ప్రమాదంలో ఆయన తల సీసీరోడ్డుకు బలంగా తగలడంతో వైద్యం కోసం శ్రీకాకుళం కిమ్స్‌కు తోటి సిబ్బంది తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సోమేశ్వరరావు తలకు ఆదివారం రాత్రి అక్కడి వైద్యులు ఆపరేషన్ చేసినా ఫలితం లేకపోయింది. సోమవారం మధ్యాహ్నానికి సోమేశ్వరరావు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయాన్ని వైద్యులు తెలపడంతో భార్య ఐశ్యర్య, తల్లిదండ్రులు సుందరయ్య, సరస్వతమ్మ కన్నీటిపర్యంతమయ్యారు. వైద్యుల సూచనల మేరకు అవయవాలను దానం చేసేందుకు అంగీకారం తెలిపారు. అవయవదానం అనంతరం బుధవారం సోమశ్వరరావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తారని ట్రాన్స్‌కో సిబ్బంది తెలిపారు.


