సీతంపేట/ వీరఘట్టం: జూన్ ఒకటి ఎప్పుడో కాదండోయ్..ఇదిగో ఈ రోజు నుంచే సగటు మధ్యతరగతి కుటుంబాలు అష్టకష్టాలు పడాల్సిన నెల అంటే ఇదేనేమో.. విద్యాసంవత్సరం ఆరంభమవతుంది. ఈనెల 6వ తేదీ నుంచి జూనియర్ కళాశాలలు, 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అలాగే వివిధ డిగ్రీ కళాశాలలు కూడా తరగతులు నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పిల్లలను చదివించడానికి ఫీజుల బారం, పుస్తకాలు, బ్యాగులు, ఇతర స్టేషనరీ కొనుగోలుకు తల్లిదండ్రులు నానా అవస్థలు పడాల్సిందే. మరో వైపు రైతన్నలకు ఖరీఫ్ సాగుకు తగిన ఆర్థికసాయం లేక ఇబ్బందులు పడుతుంటారు. ఇంకోవైపు పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో పెరిగిన పెట్రోల్, డీజిల్ నిత్యావసర సరుకుల ధరలతో సగటు మధ్యతరగతి కుటుంబీకుడు ఏవీ కొనుగోలు చేయలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. జిల్లాలోని 15 మండలాల్లో 1.12 లక్షల ఎకరాల్లో సుమారు 35 వేల మంది రైతులు ఖరీఫ్‌లో వరి సాగు చేస్తున్నారు. ఒక ఎకరాలో సాగు చేయాలంటే రూ.15వేల నుంచి 20 వేల వరకు ఖర్చవుతుంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో రైతులు కూరగాయలు, పండ్లతోటలు సాగు చేస్తూ కుటుంబపోషణ చేస్తున్నారు. రైతులు ఖరీఫ్‌కు తమ పంట పొలాలకు సాగుకు సిద్ధం చేస్తున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేయడానికి సమాయత్తమవుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా అప్పులు చేసైనా పంటలు పండించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇదీ పరిస్థితి..
ఇంజినీరింగ్, డిగ్రీ, ఫార్మసీ,ఇతర సాంకేతిక కోర్సులు చదవడానికి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. రోజు పదుల సంఖ్యలో పాఠశాలలకు చెందిన బస్సులు, విద్యార్థులను తీసుకువెళ్లేందుకు గ్రామాలకు వస్తుంటాయి. ఇదేవిధంగా ప్రస్తుతం రైతులు ఖరీఫ్‌లో సాగుకు సిద్ధమవుతున్నారు. పంట పెట్టుబడికి రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇటు వ్యవసాయ మదుపులు, అటు కళాశాల, పాఠశాలల ఫీజుల భారంతో ఇబ్బందులు పడుతున్నారు.
అందని పథకాల సొమ్ము..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ పథకాల రూపంలో దాదాపు ప్రతి నెలా ఏదో ఒక రూపంలో ప్రజలకు డబ్బులు ఖాతాల్లో జమయ్యేవి.అవి స్కూల్,వ్యవసాయం,ఖర్చులకు ఆసరాగా నిలిచేవి.అమ్మ ఒడి,విద్యా దీవెన,వసతి దీవెన,విదేశీ విద్యా దీవెన,పధకాలతో ఠంచనుగా చెప్పిన తేదీకే తల్లిదండ్రుల ఖాతాల్లో సొమ్ము జమ అయ్యేది.దీంతో పేద,మధ్య తరగతికి చెందిన ప్రజలు తమ పిల్లల్ని దర్జాగా చదివించేవారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పథకాలకు పంగనామం పెట్టేసింది.గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో జిల్లాలో అమ్మ ఒడి ద్వారా రూ.645 కోట్లు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమచేసింది.1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంటిలో ఎంతమంది చదివితే అందరికీ తల్లికి వందనం రూ.15 వేలు చొప్పున ఇస్తామని కూటమి ప్రభుత్వం చెప్పింది.తల్లికి వందనం కోసం గతేడాది జిల్లాలో 69,600 మంది తల్లులను గుర్తించారు. మొత్తం 1,08,951 మంది విద్యార్థులను అర్హులుగా గుర్తించారు.అయితే వారిలో 69 వేల మంది మంది తల్లులకు మాత్రమే తల్లికి వందనం ఇచ్చి మిగిలిన సుమారు 40 వేలకు పైబడి తల్లులకు వివిధ కారణాలు సాకుగా చూపి తల్లికి వందనం ఎగ్గొట్టేశారని తల్లిదండ్రులు కూటమి ప్రభుత్వం తీరును దుయ్యబడుతున్నారు.
మధ్య తరగతి కుటుంబాలకు తప్పని ఆర్థిక కష్టాలు
పిల్లల చదువుల ఖర్చులకు అవస్థలు
ఖరీఫ్ సాగు రైతులకు పెట్టుబడులకు అప్పులు
ఫీజుల మోత..
ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో పీజులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. పాతబకాయిలు చెల్లించాలంటూ ఇప్పటికే ఇంజినీరింగ్ కళాశాలలు విద్యార్థులపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో ఫీజులు కట్టకపోతే కళాశాలల్లో చేరనిస్తారో లేదో తెలియని పరిస్థితి ఉందని విద్యార్థులు వాపోతున్నారు. ఎంతోకొంత మొత్తమైనా చెల్లించాలని ఒత్తిడి ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.


