పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కారవేదికలో(పీజీఆర్‌ఎస్) అందజేసే అర్జీల వివరాలు మీకోసం వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చునని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజల అభ్యర్థన మేరకు ఉదయం 9 గంటలనుంచి 12 గంటలవరకు అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అర్జీలను మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చునని, వాటి స్థితిని 1100 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చునన్నారు.
జేసీకి ఘనంగా వీడ్కోలు
పార్వతీపురం: జిల్లా జాయింట్ కలెక్టర్‌గా సేవలందించిన సి. యశ్వంత్ కుమార్ రెడ్డికి ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బదిలీ కావడంతో కలెక్టరేట్‌లో ఆదివారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ పదవులు తాత్కాలికమైనవైనా, ప్రజల కోసం చేసిన సేవలు శాశ్వత గుర్తింపును తెస్తాయన్నారు. జిల్లా అభివృద్ధికి యశ్వంత్ కుమార్ రెడ్డి అందించిన సేవలను ప్రశంసిస్తూ, కొత్త బాధ్యతల్లో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పాలకొండ సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్వో కె.హేమలత తదితర అధికారులు ఆయన పరిపాలనా నైపుణ్యాన్ని కొనియాడారు. యశ్వంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పనిచేసిన అనుభవం ఎంతో సంతృప్తినిచ్చిందని, సహకరించిన అధికారులు, ఉద్యోగులు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అధికారులు ఆయనను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించి ఆత్మీయంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రాజాం సిటీ: భాష ఏదైనా నాటక రచన గొప్ప ప్రక్రియ అని పద్మశ్రీ యడ్ల గోపాలరావు అన్నారు. నాటకంలోని సాహిత్యం సాహితీవేత్తలను అలరిస్తే, ప్రదర్శన సమయంలో నటుల నటన పండితుల్ని, సామాన్యుల్ని కూడా రంజింపజేస్తుందని కొనియాడారు. ఆదివారం స్థానికంగా రాజాం రచయితల వేదిక 136వ సమావేశం నిర్వహించారు. సమావేశంలో దివంగత కాకినాడ పూజ్యనాథం ఆచారి రచించిన ‘రావణబ్రహ్మ’ పద్య నాటక పుస్తకాన్ని గోపాలరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొప్ప గొప్ప కవులు రాయబట్టే గయోపాఖ్యానం, సత్యహరిశ్చంద్ర వంటి పౌరాణిక నాటకాలు నేటికీ నిలిచి ఉన్నాయన్నారు. రావణబ్రహ్మ నాటకం కూడా వాటి కోవకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం రచయిత భార్య కాకినాడ సర్వలక్ష్మిని రాజాం రచయితల వేదిక సభ్యులు ఘనంగా సత్కరించారు. రంగస్థల నటుడు, సంస్కృత పండితులు బౌరోతు శంకరరావును రంగస్థల నాటక సేవలను గుర్తించి సత్కరించారు. గార రంగనాథం అధ్యక్షతన జరిగిన సమావేశంలో అతిథులుగా ద్విశతావధాని మరడాన శ్రీనివాసరావు, మేడూరి సత్యనారాయణమూర్తి, పాటోజు బ్రహ్మాజీరావు, లంక సూర్యారావు, ప్రముఖ వైద్యులు గార రవిప్రసాద్, కోడ పురుషోత్తం, డాక్టర్ ఆల్తి మోహనరావు, పిల్లా తిరుపతిరావు, గార సీతారత్నం, లంక విజయభాస్కర్, ఒమ్మి రమణమూర్తి, పొట్నూరు కోటిబాబు, రాజాపు శాంతారావు తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం అర్బన్: పట్టణంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న ది ఆఫీసర్స్ క్లబ్ నూతన కార్యవర్గ కమిటీ ఎన్నికలను జూన్ 17న నిర్వహించనున్న ట్టు ఎన్నికల అధికారి, సహకార శాఖ జిల్లా అధికారి పి.రమేష్ తెలిపా రు. ఈ ఎన్నికలకు సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన ఆదివారం వెల్లడించారు. ఈ క్లబ్ నిర్మాణంలో భాగంగా కమిటీకి అధ్యక్షుడిగా కలెక్టర్, ఉపాధ్యక్షులుగా ఎస్పీ, జాయింట్ కలెక్టర్ వ్యవహరిస్తారు. కమిటీలో కార్యదర్శి, కోశాధికారి, సంయుక్త కార్యదర్శి పదవులకు ఎన్నికలు జరుగుతాయి. కార్యవర్గ సభ్యులుగా అధికారుల విభాగం నుంచి నలుగురిని, నాన్ అఫీషియల్స్ విభాగం నుంచి ఐదుగురిని ఎన్నుకుంటారు. మొత్తం 12 మంది సభ్యులతో ఈ నూతన కమిటీ ఏర్పాటవుతుంది.


