పొగాకుతో కేన్సర్‌ ముప్పు | - | Sakshi
Sakshi News home page

పొగాకుతో కేన్సర్‌ ముప్పు

Jun 1 2026 12:44 AM | Updated on Jun 1 2026 12:44 AM

డీఎంహెచ్‌ఓ భాస్కర రావు

పార్వతీపురం రూరల్‌: పొగాకు ఉత్పత్తుల వాడకంతో ప్రాణాంతక కేన్సర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులు సంభవించి జీవితాలు దుర్భరమవుతాయని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్‌ ఎస్‌. భాస్కరరావు, జిల్లా ఎన్‌సీడీ పీఓ డాక్టర్‌ టి.జగన్‌ మోహనరావు తెలిపారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆదివారం పార్వతీపురంలో వైద్యారోగ్యశాఖ, ఈగల్‌ టీమ్‌, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించి, స్థానిక యువత, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ జగన్‌మోహన్‌ మాట్లాడుతూ.. పొగాకు అలవాటు వల్ల నోరు, గొంతు, అన్నవాహిక, ఊపిరితిత్తుల కేన్సర్లతో పాటు గుండె జబ్బులు, పక్షవాతం, శ్వాసకోశ సమస్యలు, సంతానోత్పత్తి లోపాలు తలెత్తుతాయన్నారు. జిల్లాలో నిర్వహించిన ఎన్‌న్‌సీడీ 4.0 సర్వేలో ఇప్పటివరకు 284 మందిలో నోటి కేన్సర్‌ అనుమానిత లక్షణాలు గుర్తించామని, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా యువత ఈ వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. కళాశాలలు, పాఠశాలల పరిసరాల్లో పొగాకు విక్రయాలను అరికట్టేందుకు ’కోట్పా’ చట్టం ప్రకారం ఈగల్‌ టీమ్‌ కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. పొగాకు మాన్పించేందుకు ప్రభుత్వం ఉచితంగా నికోటిన్‌ ప్యాచెస్‌, నికోటిన్‌ గమ్స్‌ అందిస్తోందని, డి–అడిక్షన్‌ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీఐఓ డాక్టర్‌ వై.విజయ్‌ మోహన్‌, ఈగల్‌ టీమ్‌ ఎస్సై జె. భాస్కరరావు, నేత్ర వైద్యాధికారి జె. నాగేష్‌ రెడ్డి, ఎన్‌టీసీపీ కౌన్సిలర్‌ కె.భవాని, డీఎంహెచ్‌పీ కౌన్సిలర్‌ కె.కృష్ణారావు, డిప్యూటీ డెమోలు గిరిబాబు, ప్రసాద్‌, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి రవికుమార్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement