పోషక రేడు..నేరేడు | - | Sakshi
Sakshi News home page

పోషక రేడు..నేరేడు

Jun 1 2026 12:44 AM | Updated on Jun 1 2026 12:44 AM

పోషక రేడు..నేరేడు

నేరేడు పండ్లతో ప్రయోజనాలు

నేరేడు పండ్లలో ఐరన్‌, కాల్షియం, పొటాషియంతో పాటు ఎ.సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి సీజనల్‌ వ్యాధుల బారి నుంచి రక్షణ కల్పిస్తాయి.

● మూత్ర సమస్యల నియంత్రణతో పాటు మధుమేహం అదుపులో ఉంటుంది. కిడ్నీలను శుభ్రపరుస్తుంది. మూత్రాశయంలో ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. కాలేయ పనితీరును మెరుగుపర్చడంతో పాటు శుభ్రపరుస్తుంది.

● నేరేడు పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు, మెదడుకు దివ్య ఔషధంగా పనిచేస్తాయి.

● దంతాలు, చిగుళ్లు ఆరోగ్యకరంగా ఉంటాయి. చిగుళ్ల నుంచి రక్తస్రావం తగ్గుతుంది. నోట్లో చెడు బ్యాక్టీరియా నశించి దుర్వాసన రాకుండా చేస్తుంది.

● కడుపులో పేరుకుపోయిన మలినాలు బయటకు పోవడానికి, పేగుల్లో చుట్టుకు పోయిన వెంట్రుకలను కరిగించడానికి ఈ నేరేడు పండు దోహదపడుతుంది.

● నేరేడుపండులో విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల శరీరంలో సంభవించే అనేక రుగ్మతలను నివారిస్తుంది. అన్ని వేళలా ఆరోగ్యానికి భరోసా కల్పిస్తుంది.

ప్రస్తుత సీజన్‌లో విరివిగా లభ్యం

ఆరోగ్య ఫల ప్రదాయినిగా గుర్తింపు

పాలకొండ రూరల్‌: ప్రకతి ప్రసాదించే పండ్లజాతుల్లో ఒకటైన ఆరోగ్య ఫల ప్రదానియగా పిలిచే నేరేడు పండును సక్రమంగా వినియోగించుకుంటే ఆరోగ్యానికి సంపూర్ణంగా మేలు చేయడంతో పాటు శరీరంలో ఏర్పడే అనేక అనారోగ్య సమస్యలను, రుగ్మతలను దూరం చేస్తుంది. రుచిలో మేటిగా ఉండే నేరేడు పండు తినడం వల్లే కాదు ఆకులు, చెట్టు బెరడు కూడా శరీరానికి చక్కని మేలు చేకూరుస్తాయి. నేరేడుపండులో అత్యధిక పోషకాలు ఉన్న క్రమంలో పండు రూపంలోనే కాకుండా ఆరోగ్య పానీయాలు, జామ్‌లు, ఐస్క్రీమ్‌లు తయారు చేసుకోవచ్చు. నేరేడు కాయలను వెనిగర్‌, వైన్‌ తయారీలో ఉపయోగిస్తారు. నేరేడుపండ్లు కోయడం చాలా శ్రమతో కూడుకున్నది కావడంతో ధర కూడా అదే విధంగా ఉంటుంది. రైతు దగ్గర దళారులు కేజీ రూ.90కి కొనుగోలు చేస్తున్న స్థానిక వ్యాపారు లకు రూ.120 వరకూ విక్రయిస్తారు. సంప్రదాయ ఆయుర్వేద వైద్య విధాన పరంగా అనేక ఔషధ లక్షణాలు కలిగి ఉన్న నేరేడుకు అత్యంత ప్రాముఖ్యం ఉంది. నేరేడు పండు తింటే వ్యాధులకు, రోగకారక సమస్యలకు దూరంగా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు.

నేరేడుపండ్లు తినడంలో నియంత్రణ లేకుంటే దుష్ఫలితాలు సంభవించవచ్చు.

వగరు రుచి కలిగిన నాణ్యత లేని నేరేడుపండ్లు భుజిస్తే గొంతు నొప్పి సంభవించవచ్చు. సీజన్‌ మారే సమయంలో ఈ పండ్లను మితంగా తినాలి.

ఉబ్బసం రోగం ఉన్నవారు ఈ పండ్లను ఎక్కువగా తినరాదు. దీర్ఘకాలికమైన శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

నేరేడుపండ్లలో ఉండే అత్యధిక లవణాలు, పోషకాల వల్ల బలహీనమైన జీర్ణవ్యవస్థ కలిగిన వారికి తరచూ కడుపునొప్పి సంభవించే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement