● జూన్ 15 నుంచి ఇంటింటికీ బీఎల్‌ఓలు
● 1,032 మంది సిబ్బందికి కిట్ల పంపిణీ
పార్వతీపురం: జిల్లాలో జూన్ 15వ తేదీ నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా శనివారం కలెక్టరేట్ చాంబర్‌లో కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి బూత్ స్థాయి అధికారులకు (బీఎల్‌ఓలు) ప్రత్యేక కిట్లను పంపిణీ చేశారు. జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి, ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించనున్న 1,032 మంది బీఎల్‌ఓలకు ఈ కిట్లను అందజేశారు. విధుల్లో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రతీ కిట్‌లో అవసరమైన స్టేషనరీ సామగ్రితో పాటు ఎండ, వానల నుంచి రక్షణకు గొడుగు, వాటర్ బాటిల్‌ను కూడా చేర్చారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు నెల రోజుల పాటు సాగే ఈ సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో నిర్వహించాలని, ఎలాంటి లోపాలకు తావులేకుండా సమర్థవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.


