డిజిటలైజేషన్ ప్రక్రియ కోసం సాఫ్ట్‌వేర్ విడుదల
జీఓ ఉపసంహరణకు డిమాండ్
● జిల్లాలో 270 మంది ఉద్యోగుల భవిష్యత్తుపై అనిశ్చితి
విజయనగరం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల ఉద్యోగులకు వర్తింపచేస్తున్న హెచ్‌ఆర్‌పాలసీ, జీఓ–322 అమలు నేపథ్యంలో ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఉమ్మడి జిల్లాలో 94 పీఏసీఎస్‌లలో వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న 270 మంది ఉద్యోగులు వేతనాల చెల్లింపు, వేతనపెంపు అమలుపై అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వీరిలో పాలసీ వర్తించే రెగ్యులర్ ఉద్యోగులు 170 మంది వరకు ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 20 శాతం ప్రాథమిక వేతన పెంపు, గ్రాట్యుటీ పరిమితి పెంపు, గ్రూప్ మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ వంటి ప్రయోజనాలు హెచ్‌ఆర్‌ఎంఎస్ కింద మాత్రమే అమలవుతాయని స్పష్టం చేసింది. అయితే, జిల్లాలోని అనేక సహకార సంఘాల్లో ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ల డిజిటలైజేషన్, హెచ్‌ఆర్‌ఎంఎస్‌లో అప్లోడ్ ప్రక్రియ పూర్తి కాలేదని సమాచారం. దీంతో మేనెల జీతాల బిల్లుల ప్రాసెసింగ్, పే స్లిప్‌ల తయారీ ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సంఘాల్లో జీతాలు ఒకటి, రెండు నెలల ఆలస్యంగా చెల్లిస్తున్న పరిస్థితి ఉండగా కొత్త విధానం అమలుతో మరింత జాప్యం జరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
‘కెపాసిటీ టు పే’ నిబంధనపై అభ్యంతరాలు
మరో వైపు జీఓ–322 ప్రకారం లాభాల్లో ఉన్న సహకార సంఘాల ఉద్యోగులకు మాత్రమే వేతన పెంపు వర్తించే అవకాశం ఉండడంపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం తెలుపుతున్నాయి. నాబార్డు నిర్దేశించిన ‘కేపాసిటీ టు పే’ (చెల్లింపు సామర్ధ్యం) నిబంధన ఆధారంగా చేసుకుని వేతన పెంపు అమలు చేయడం అన్యాయమని పేర్కొంటున్నాయి. జిల్లాలోని అన్ని పీఏసీఎస్‌లు ఒకే ఆర్థిక స్థితిలో లేకపోవడంతో కొందరు ఉద్యోగులకు వేతన పెంపు లభించి, మరికొందరు ఆ ప్రయోజనాలకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని 94 సంఘాలలో కేవలం 10 సంఘాలు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. వీటిలో పనిచేస్తున్న దాదాపు 30 మంది ఉద్యోగులకు మాత్రమే వేతనపెంపు వర్తిస్తుంది.
ఉద్యోగుల వివరాల ధ్రువీకరణ, సర్వీస్ రిజిస్టర్ల నవీకరణ, మూడంచెల పరిశీలన, హెచ్‌ఆర్‌ఎంఎస్‌లో డేటా నమోదు వంటి ప్రక్రియలు పూర్తికావాల్సి ఉంది. దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ తాజాగా విడుదలైంది. ఆ సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగుల డేటాను అప్‌లోడ్ చేయడంపై సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. ఈ పనులు వేగంగా పూర్తయిన తర్వాతే జిల్లాలో పాలసీ వర్తించే 170 మంది ఉద్యోగులకు మే నెల జీతాలు విడుదలవుతాయి. ప్రస్తుతం లాభాల్లో లేకపోయినా రానున్న మూడేళ్లలో లాభాలబాటలో తీసుకొస్తామని పీఏసీఎస్‌లు తీర్మానం చేసి నాబార్డుకు ఇస్తే లాభాల్లోకి రావడానికి అవసరమైన మొత్తం రుణంగా ఇస్తుంది. ఆ రుణాన్ని వాయిదాల పద్ధతిలో సంఘాలు చెల్లించుకోవాలి.
– పి.రమేష్, జిల్లా సహకార శాఖ అధికారి
జీఓ–322లోని ‘కెపాసిటీ టు పే’ నిబంధనను రద్దు చేసి, లాభనష్టాలతో సంబంధం లేకుండా అన్ని సహకార సంఘాల ఉద్యోగులకు సమానంగా వేతనపెంపు వర్తింపజేయాలి. సహకార రంగ ఉద్యోగుల సేవా భద్రత, వేతన భరోసా కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. జిల్లాలో ఇప్పటికే ఆర్థిక, పరిపాలనా ఒత్తిడిలో పనిచేస్తున్న సహకార ఉద్యోగులు హెచ్‌ఆర్‌పాలసీ అమలు ప్రక్రియ పూర్తయ్యే వరకు తమ వేతనాలు, కొత్త ప్రయోజనాలపై స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు.
– పి.కామేశ్వరరావు, జిల్లా గౌరవాధ్యక్షుడు,
పీఏసీఎస్ ఉద్యోగుల సంక్షేమ సంఘం


