భానుడి భగభగలు | - | Sakshi
Sakshi News home page

భానుడి భగభగలు

May 31 2026 12:36 AM | Updated on May 31 2026 12:36 AM

భానుడి భగభగలు ఆ ట్రాక్టర్లకు జరిమానా వేయొద్దు..!

పార్వతీపురం: జిల్లాలో రాబోయే ఐదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా కొనసాగనున్నట్టు రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ (ఆర్టీజీ) విభాగం హెచ్చరికలు జారీచేసినట్టు కలెక్టర్‌ డా.ఎన్‌. ప్రభాకరరెడ్డి శనివారం తెలిపారు. జిల్లాలోని 15 మండలాల్లో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని కురుపాం, గుమ్మలక్ష్మీపురం, సాలూరు, పార్వతీపురం, గరుగుబిల్లి, పాలకొండ, బలిజిపేట, వీరఘట్టం, కొమరాడ, జియ్యమ్మవలస, పాచిపెంట, భామిని, సీతంపేట, సీతానగరం, సాలూరు, తదితర మండలాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 54 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డీహైడ్రేషన్‌కు గురికాకుండా తరుచూ తగినంత నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని సూచించారు.

సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో ఇసుక అక్రమ తరలింపు వెనుక అధికార పార్టీ నాయకుల హస్తాలు బయట పడుతున్నాయి. ప్రతి రోజూ ఏదో చోట ట్రాక్టర్లను పట్టుకుంటున్న అధికారులకు ప్రజా ప్రతినిధుల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయి. ఇటీవల పార్వతీపురానికి ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను అధికారులు పట్టుకుని జరిమానా విధించారు. శనివారం కూడా సీతానగరం మండలంలో ఓ రేవు నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తుండగా.. రెండు ట్రాక్టర్లను తహసీల్దారు పట్టుకుని జరిమానా విధించినట్లు సమాచారం. ఓ ప్రజా ప్రతినిధికి సంబంధించిన ఇంటి నిర్మాణానికి ఈ ఇసుక తరలిస్తుండగా.. అధికారులు పట్టుకోవడం గమనార్హం. ఈ రెండు ఘటనల్లోనూ వాటిని విడిచి పెట్టాలని సదరు ప్రజా ప్రతినిధి అధికారుల మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారని భోగట్టా. పలు సందర్భాల్లో ప్రభుత్వ సిబ్బంది పట్టువిడుపుగా ఉంటున్నా.. కొన్ని సార్లు జరిమానాలు వేస్తుండడం నాయకులకు కోపం తెప్పిస్తోంది. ఈ విషయాలను బయట పెట్టేందుకు కూడా అధికారులు భయపడుతున్నారు. సదరు ప్రజా ప్రతినిధుల నుంచి తర్వాత జరిగే పరిణామాలను ఊహించుకుని ఆందోళన చెందుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులే బలయిపోతున్నారని.. ఇంక తాము ఎంత అంటూ మౌనం దాల్చుతున్నారు.

21న ‘రీ–నీట్‌’

జిల్లాలో 7 కేంద్రాలు

హాజరుకానున్న విద్యార్థులు 1,901 మంది

విజయనగరం అర్బన్‌: నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 21న నిర్వహించనున్న ‘రీ–నీట్‌’ ప్రవేశ పరీక్షకు జిల్లాలో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అఽధికారి సత్తిబాబు తెలిపారు. తన చాంబర్‌లో పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో ఆయన శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ రోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు జిల్లాలోని 7 పరీక్ష కేంద్రాల్లో నీట్‌ జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,901 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ప్రశ్నప్రత్రాల భద్రత, గోప్యత విషయంలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని అధికారులకు హెచ్చరికలు జారీచేశారు. సమావేశంలో నీట్‌ సిటీ కోఆర్డినేటర్‌, కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్‌ దిలీప్‌ మోదీతో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రిన్సిపాల్స్‌, చీఫ్‌ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

వడదెబ్బతో వేతనదారు మృతి

బొండపల్లి: ఉపాధిహామీ పనులకు వెళ్లిన వేతనదారు ఇంటికి వచ్చే క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. కుటుంబ సభ్యులు, వేతనదారులు తెలిపిన వివరాల ప్రకారం.. బొండపల్లి మండలం కనిమెరక గ్రామానికి చెందిన తెలుగు అప్పన్న (53) గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులకు శనివారం వెళ్లారు. ఉదయం పదిన్నర గంటల సమయంలో ఇంటికి చేరే క్రమంలో ఎండకు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి గజపతినగరంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అక్కడ చికిత్స పోందుతూ కొద్ది క్షణాల్లో మృతి చెందారు. ఆయనకు భార్య బంగారమ్మ, కుమారుడు శ్రీనివాసరావు, కుమార్తె ఎర్రయ్యమ్మ ఉన్నారు. ఇంటిపెద్ద వడదెబ్బకు గురై మృతిచెందడంతో కన్నీరుపెడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement