చుక్కవలసలో సరికొత్త దోపిడీ | - | Sakshi
Sakshi News home page

చుక్కవలసలో సరికొత్త దోపిడీ

May 31 2026 12:36 AM | Updated on May 31 2026 12:36 AM

పండ్ల తోట ముసుగులో ఉపాధిహామీ నిధుల మేత

చీపురుపల్లిరూరల్‌(గరివిడి): ఉద్యాన పంటల సాగుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ నిధులను పెద్దమొత్తంలో అందిస్తోంది. దీనినే ఆసరాగా చేసుకుని గరివిడి మండలం చుక్కవలస గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు సాగు ముసుగులో ఉపాధిహామీ నిధులను పెద్దమొత్తంలో కాజేశారు. మొత్తం 11 మంది రైతుల పేర్లతో సమారు 5.5 ఎకరాల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు జరిగినట్లు అధికారిక రికార్డుల్లో నమోదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కేవలం 2 నుంచి 3 ఎకరాల మధ్య మాత్రమే డ్రాగన్‌ఫ్రూట్‌ తోటలు కనిపిస్తున్నాయి. మరోవైపు సాగుచేసిన ఆ విస్తీర్ణంనే కొత్త రైతుల పేర్లతో ఏటా రికార్డుల్లో నమోదుచేస్తూ ప్రోత్సాహకాలను కై ంకర్యం చేయడం గమనార్హం. మరోవైపు డీ పట్టా భూముల్లో సాగుచేసిన తోటలను జిరాయితీ భూముల్లో సాగుచేసినట్టు పేర్కొని నిబంధనలకు విరుద్ధంగా నిధులు కాజేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవంగా 50 సెంట్ల విస్తీర్ణంలో డ్రాగన్‌ ఫ్రూట్‌ తోటలను సాగుచేసే రైతుకు సుమారు రూ.2లక్షల వరకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తోంది. దీనిని టీడీపీ నాయకులు అధికార బలంతో అందిపుచ్చుకున్నారు. పంట సాగుచేయకుండా రికార్డుల్లో చూపుతూ నిధులను కొట్టేశారు. అధికారులు తనిఖీలకు వచ్చే సమయంలో ఇప్పటికే పాత రైతులు సాగుచేసిన తోటలనే చూపించినట్టు సమాచారం. గ్రామానికి కేటాయించిన ఉపాధిహామీ నిధులన్నీ తోటల పేరుతో దొడ్డిదారిని దారిమళ్లిస్తూ, పని కల్పించడంలేదని ఎంపీడీఓ సుబ్రహ్మణ్యంకు మూడురోజుల కిందట వేతనదారులు ఫిర్యాదు చేశారు. నిధుల దోపిడీపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement