సాలూరు: ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే.. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (సర్)లో బీఎల్‌ఏల (బూత్ లెవెల్ ఏజెంట్లు) పాత్ర కీలకమైనదని, అర్హుల ఓట్లు జాబితాలో ఉండేలా నిబద్ధతతో పనిచేయాలని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర పిలుపునిచ్చారు. సాలూరు పట్టణం మెంటాడ వీధిలోని కల్యాణ మండపంలో నియోజకవర్గంలోని వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏలకు శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి బూత్ పరిధిలోని ఓటరు జాబితాలను బీఎల్‌ఏలు క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఇతర పార్టీలు ఎటువంటి అక్రమాలకు పాల్పడకుండా ప్రత్యేకంగా దృష్టిసారించాలని తెలిపారు. ఓటర్ల చేర్పులు, తొలగింపుల్లో అభ్యంతరాలుంటే తక్షణమే నిబంధనల ప్రకారం సంబంధిత బూత్ లెవెల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. అర్హుల ఓటు తొలగింపు జరగకుండా, అనర్హుల పేర్లు చేర్పులు జరగకుండా చూడాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యతలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతిఓటు ఎంతో విలువైనదని, ఓ గ్రామంలో ఒక్క ఓటు, మండల, నియోజకవర్గ స్థాయికి చేరేసరికి వేలల్లో మార్పు చూపుతుందని, అది గెలుపును ప్రభావితం చేస్తుందన్న విషయం గుర్తించాలన్నారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగింపునకు ప్రయత్నించే అవకాశం ఉందని, వాటన్నింటినీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
చంద్రబాబుపై ప్రజలకు నమ్మకం పోయింది...
ఓ వైపు లక్షలకోట్ల రూపాయలు అప్పులుచేస్తూ.. మరోవైపు ప్రజాసంక్షేమాన్ని, అభివృద్ధిని విస్మరించి న సీఎం చంద్రబాబుపై ప్రజలకు నమ్మకం పోయిందని పీడికరాజన్నదొర పేర్కొన్నారు. చంద్రబాబు ప్ర భుత్వ పాలనపై వ్యతిరేకత మొదలైందన్నారు. క్షేత్రస్దాయిలో ప్రజలకు అండగా నిలిచి, వైఎస్సార్‌సీపీని మరింత బలోపేతం చేయాలని పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్లు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–సర్) ప్రక్రియపై బూత్ లెవెల్ ఏజెంట్లకు వైఎస్సార్‌సీపీ విశాఖపట్నం ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు గణేష్ ప్రొజెక్టర్‌పై శిక్షణ ఇచ్చారు. బీఎల్‌ఏల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా పరిశీలకుడు శరగడం అప్పలనాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మక్కువ జెడ్పీటీసీ సభ్యుడు మావుడి శ్రీనివాసులనాయుడు, వైఎస్సార్ సీపీ మక్కువ మండలాధ్యక్షుడు మావుడి రంగునాయుడు, వైఎస్సార్‌సీపీ మండల, పట్టణ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియపై పర్యవేక్షణ అవసరం
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు
ఉండేలా బీఎల్‌ఏలు ప్రత్యేక చొరవ చూపాలి
బీఎల్‌ఏ శిక్షణ సమావేశంలో
దిశానిర్దేశం చేసిన మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర


