గరుగుబిల్లి: ప్రజల సమస్యలను గ్రామస్థాయిలోనే తెలుసుకొని త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. ‘ఒక రోజు– ఒక నియోజకవర్గం’ కార్యక్రమంలో భాగంగా మండలంలోని కొంకడివరం పంచాయతీ సీతారాంపురం గ్రామంలో శుక్రవారం పర్యటించి ప్రజాసమస్యలు తెలుసుకున్నారు. వినతులు స్వీకరించారు. గ్రామంలోని ధర్మ కోనేరుకు రిటైనింగ్‌వాల్ నిర్మించడంతో పాటు కోనేరు గట్టును వాకింగ్ ట్రాక్‌గా అభివృద్ధి చేయాలని గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. సీతారాంపురం గ్రామ సమీపంలో డంపింగ్‌యార్డు నిర్మాణం ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కోరుతూ తాజా మాజీ సర్పంచ్ అల్లు అప్పలనాయుడు, గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. గ్రామంలో తాగునీటి సమస్య, ప్రధాన రహదారి నుంచి కొంకడి వరం గ్రామం వరకు రోడ్డు నిర్మాణం, ఇనామ్‌దారుల భూ సమస్యలు, వయో వృద్ధుల పింఛన్లు, అంత్యోదయ కార్డులు మంజూరు, తదితర సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, ఎస్‌డీసీ దిలీప్ చక్రవర్తి, ఎంపీపీ ఉరిటి రామారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


