● రూ.రెండున్నర లక్షల ఆస్తి నష్టం
బాడంగి: మండల కేంద్రంలోని ఐసీడీఎస్ కార్యాలయానికి ఆనుకొని ఉన్న పంట పొలాల్లో ప్రమాదవశాత్తు గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. లచ్చుపతుల శ్రీరాముకు చెందిన సుమారు రెండెకరాల నిలవరం, బల్జి రమణకు చెందిన 0.25 సెంట్లలో విత్తనానికి ఉంచిన చెరకు కాలిపోయి నష్టం సంభవించినట్టు రైతులు తెలిపారు. సుమారు రూ.రెండు లక్షల వరకు నష్టం జరిగినట్టు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎంఆర్‌ఐ జగదాంబ, వీఆర్‌ఓ ఆర్‌వీ రమణమూర్తినాయుడు ప్రమాద స్థలానికి చేరుకొని నష్టాన్ని అంచనా వేశారు. డొంకినవలసలోని అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం
మెంటాడ: మండలంలోని లోతుగెడ్డ పంచాయతీ ఎస్టీ కాలనీలో గురువారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో అద్దాల చిన్నమ్మి, అప్పన్న దంపతులకు చెందిన పూరిల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ.85 వేల నగదు, తులమున్నర బంగారు ఆభరణాలు, కొద్ది మొత్తంలో వెండి కాలిపోయాయి. ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న నగదు కాలిపోవడంతో బాధితులు లబోదిబోమన్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు కోరారు.
విజయనగరం క్రైమ్ : అప్పులిచ్చి అధిక వడ్డీల పేరిట వేధిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. డబ్బులిచ్చి అధిక వడ్డీ వసూలు చేయడం, అప్పు తీసుకున్న వారిని బెదిరించడం ఇచ్చిన అప్పు కంటే అధికంగా అసలుతో పాటు వడ్డీని వసూలు చేయడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో కొందరు బయట వ్యక్తులకు జిల్లాకు వచ్చి అవసరాల్లో ఉన్న వారిని గుర్తించి వారికి అప్పులిచ్చి అధిక వడ్డీ వసూలు చేస్తూ ఆర్థికంగా, మానసికంగా వేధిస్తూ వ్యాపారం చేస్తున్నట్టు తమ దృష్టి వచ్చిందని తెలిపారు. డబ్బులిచ్చి బ్లాంక్ ప్రామిసరీ నోటు, బాండ్ పేపరు, తెల్లకాగితం మీద సంతకాలు చేయించుకుంటూ డబ్బులు సకాలంలో ఇవ్వకుంటే కొల్‌కత్తా, బిహార్ వంటి బయట రాష్ట్రాల కోర్టుల్లో కేసులు వేసి భయపెట్టి భయబ్రాంతులకు గురి చేస్తూ వేధిస్తున్నారని పేర్కొన్నారు. దీన్నే కాల్‌మనీ వ్యాపారం అంటారని తెలిపారు. అటువంటి వారిపై కేసులు నమోదు చేసి వారి ఆస్తులను జప్తు చేయడంతో పాటు రౌడీషీట్‌లు తెరుస్తామని హెచ్చరించారు.
15న అండర్– 23 పురుషుల క్రికెట్ జట్టు ఎంపికలు
విజయనగరం: అండర్– 23 పురుషుల జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు ఈ నెల 15న నిర్వహించనున్నట్టు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పి.సీతారామరాజు (రాంబాబు) గురువారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని బాబా మెట్ట శివారు విజ్జి స్టేడియంలో ఆదివారం ఉదయం 7.30 గంటలకు ఎంపిక పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు వారి సొంత క్రికెట్ కిట్టు, ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రంతో పాటు తెలుపు దుస్తులు ధరించి రావాలని సూచించారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో..
మెరుగైన ఫలితాలు సాధించాలి
విజయనగరం: స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో మున్సిపల్ కార్పొరేషన్‌కు మెరుగైన ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ బి.బాలస్వామి సూచించారు. ఇదే విషయమై ఆయన నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన చాంబర్‌లో అన్ని విభాగాల అధికారులు, సిబ్బందితో గురువారం సమావేశమై దిశానిర్దేశం చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2026 సర్వే నిమిత్తం నిర్దేశిత అన్ని అంశాల్లోనూ ప్రణాళికాబద్దమైన పనితీరును కనబరచాలన్నారు. అధికారులంతా సమన్వయం చేసుకుని, మంచి ర్యాంకు వచ్చేలా చూడాలన్నారు. సామాజిక మరుగుదొడ్ల నిర్వహణలోని లోపాలు, ఇబ్బందులను అధిగమించాలన్నారు. ఒక్క సర్వే సమయంలోనే పరిశుభ్రంగా ఉంచడం కాకుండా నిత్యం శుభ్రత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ, వినిమయ నీటి నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, పారిశుధ్య కార్మికుల సంక్షేమం, ప్రజాభిప్రాయ సేకరణ, ప్రజా సమస్యల పరిష్కార విధానాలు వంటి అంశాల్లో మెరుగైన ఫలితాలు నమోదు కావాలన్నారు. ఈ విషయంలో గతంలో కన్నా మెరుగైన ర్యాంకులు సాధించాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ కిల్లాన అప్పలరాజు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి, ఉద్యానశాఖ అధికారి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


