● మెప్మా ఆర్పీ అక్రమాలపై సభ్యుల నిలదీత
● 20 ఉద్యోగాల భర్తీకి సభ్యుల తీర్మానం
నెల్లిమర్ల: నగరపంచాయతీ కౌన్సిల్ సమావేశం గురువారం వాడీవేడిగా జరిగింది. సభ్యులు పలు సమస్యలను సమావేశంలో ప్రస్తావించారు. ఆశీలు వసూలు కోసం ఇద్దరు ఉద్యోగులు తిరుగుతున్నారని, వారు రోజంతా వసూలు చేసిన మొత్తం వారి జీతాలకే సరిపోదని కౌన్సిలర్ లెంక హైమావతి అన్నారు. వేలంపాట వెంటనే వేయాలని సూచించారు. మున్సిపాలిటీ ఆధీనంలోని బైరెడ్డి సూర్యనారాయణ కల్యాణ మండపం విస్తరణకు సభ్యులు తీర్మానించారు. అలాగే రూ.40 లక్షల వ్యయంతో పట్టణంలో 21 అభివృద్ధి పనులకు తీర్మానం చేసి ఆమోదించారు. వేసవి దృష్ట్యా తాగునీటి బోర్లకు మరమ్మతులు ఎప్పుడు చేపడతారని సభ్యులు ప్రశ్నించారు. వార్డుకు కనీసం మూడు తాగునీటి బోర్లు అయినా అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న పది ఉద్యోగాలతో పాటు మరో పది ఉద్యోగాల భర్తీకి సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. సదరు ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయాలని ప్రతిపాదించారు. ఓ మెప్మా ఆర్పీ సభ్యుల డబ్బును స్వాహా చేశారని, వాటిని ఎందుకు రికవరీ చేయడం లేదని పలువురు సభ్యులు నిలదీశారు. డబ్బు తిరిగి కట్టకపోతే సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
త్వరలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు..
నగర పంచాయతీకి చెందిన 576 టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని సదరు సంస్థ ప్రతినిధి వెంకటరమణ సమావేశంలో తెలిపారు. ఇప్పటికే 80 శాతం మేర నిర్మాణం పూర్తయ్యిందన్నారు. అలాగే 257 మంది చెల్లించిన డిపాజిట్లు రూ.96 లక్షలను ఈ నెలాఖరులోగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఏప్రిల్ నుంచి మిగిలిన నిర్మాణ పనులు ప్రారంభించాలని కాంట్రాక్టరుకు ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసినట్లు వెంకటరమణ చెప్పారు.
పట్టణంలో సొంత స్థలాలు ఉన్నవారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 140 ఇళ్లకు ఇప్పటికే పొజిషన్ సర్టిఫికెట్లు జారీ అయినట్లు హౌసింగ్ ఏఈ పవన్ కుమార్ వెల్లడించారు. మరో 152 పెండింగ్ ఉన్నట్లు చెప్పారు. సమావేశంలో నగరపంచాయతీ చైర్‌పర్సన్ బంగారు సరోజిని, కమిషనర్ జనార్ధనరావు, వైస్ చైర్మన్లు సముద్రపు రామారావు, కారుకొండ కృష్ణ, కౌన్సిలర్లు చిక్కాల సంతోష్‌కుమార్, నల్లి కృష్ణవేణి, నరవ రామలక్ష్మి పాల్గొన్నారు.


