ఉగాదిలోపు గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి
పార్వతీపురం: గృహనిర్మాణ పథకాల కింద మంజూరైన ఇళ్లను ఉగాది పండగలోపు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ మండలాల్లో పెండింగ్‌లో ఉన్న 1,500 ఇళ్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన డేటాకు మధ్య భారీ వ్యత్యాసం ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల నమోదులో నిర్లక్ష్యం వహిస్తే సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పంచాయతీ రాజ్, గిరిజన సంక్షేమం, గ్రామీణ నీటి సరఫరా తదితర విభాగాల్లో పెండింగ్‌లో ఉన్న అన్ని పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డ్వామా పీడీ కె.రామచంద్రరావు, పీఆర్, గిరిజన సంక్షేమ శాఖల ఈఈలు నగేష్, మణిరాజ్, తదితరులు పాల్గొన్నారు.
నేడు కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మేళా
కురుపాం: రస్తా కుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో శనివారం ‘సుస్థిర సేంద్రియ వ్యవసాయం–రైతాంగ ప్రగతికి సోపానం’ అనే అంశంపై కిసాన్ మేళా నిర్వహించనున్నారు. సుమారు 500 నుంచి 550 మంది రైతులు పాల్గొననున్నారు. మేళాకు ముఖ్య అతిథులుగా ప్రజాప్రతినిధులు, విశ్వవిద్యాలయ అధికారులు, కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులు హాజరుకానున్నట్టు కేంద్ర సిబ్బంది తెలిపారు.
పోలమాంబ హుండీల ఆదాయం రూ.25.47 లక్షలు
మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి ఆలయ హుండీల ఆదాయాన్ని దేవదాయశాఖ ఆధ్వర్యంలో చదురుగుడిలో శుక్రవారం లెక్కించారు. చదురుగుడిలోని ఆరు హుండీల నుంచి రూ.18,47,354లు, వనంగుడిలోని ఆరు హుండీల నుంచి రూ.7,00,065లు కలిపి రూ.25,47,419లు ఆదాయం వచ్చినట్టు ఈఓ శ్రీనివాస్ తెలిపారు. 27 గ్రాముల 520 మిల్లీ గ్రాముల బంగారం, 243 గ్రాముల వెండి లభించిందన్నారు. హుండీల ఆదాయం లెక్కింపులో పార్వతీపురం మన్యం జిల్లా దేవదాయశాఖ అధికారి ఎస్.రాజారావు, ఆలయ చైర్మన్ నైదాన చిన్నతిరుపతి, సర్పంచ్ వి.సింహాచలమమ్మ, ఎంపీటీసీ సభ్యుడు టి.పోలినాయుడు, ఉప సర్పంచ్ అల్లు వెంకటరమణ, సేవకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
ఎంఈఓపై విచారణ
సీతంపేట: సీతంపేట ఎంఈఓ ఎం.ఆనందరావుపై వచ్చిన ఫిర్యాదులపై జిల్లా విద్యాశాఖ ఏడీ గౌరీశంకర్ శుక్రవారం ఎన్‌ఆర్‌సీ కేంద్రంలో విచారణ జరిపారు. ఉపాధ్యాయుల సరెండర్ లీవులు డ్రా చేసినప్పటికీ సర్వీస్ రిజిస్టర్‌లో నమోదు చేయడం లేదని, కొంతమంది ఇంటి వద్దనే ఎఫ్‌ఆర్‌ఎస్ వేసి.. స్కూల్‌కు హాజరవుతున్నట్టు మేనేజ్ చేస్తున్నారని, క్రమశిక్షణ చర్యలు తీసుకున్న ఉపాధ్యాయులకు అవార్డుల కోసం సిఫార్సు చేశారని, పాఠ్య, నోటు పుస్తకాలు, ఇతర కిట్లు పాఠశాలలకు పంపించకుండా ఎన్‌ఆర్‌సీ నుంచి పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తూ.. స్థానికుడు ఎన్.సాయి డీఈఓ, ప్రిన్సిపాల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు రెండు విడతల కరువు భత్యం ట్రెజరీకి సబ్‌మిట్ చేయలేదని మండల ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం రాంగోపాల్ కలెక్టర్, డీఈఓలకు ఫిర్యాదు చేశారు. ఈ విచారణకు హెచ్‌ఎం రాంప్రసాద్ హాజరు కాగా.. సాయి అనే ఫిర్యాదీ గైర్హాజరయ్యారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని ఏడీ గౌరీ శంకర్ తెలిపారు.
ఉగాదిలోపు గృహ నిర్మాణాలు పూర్తి చేయాలి


