లాభసాటి పంటల సాగు శ్రేయస్కరం
● కలెక్టర్ ప్రభాకరరెడ్డి
కురుపాం: రైతులు లాభసాటి పంటలు సాగుచేసి ఆర్థికంగా బలోపేతం కావాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. కిసాన్‌మేళా వంటి కార్యక్రమాలతో రైతులు తమ గ్రామ పరిధిని దాటి వ్యవసాయ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. స్థానిక రస్తా కుంటుబాయి వ్యవసాయ కృషి విజ్ఞాన కేంద్రం ప్రాంగణంలో శనివారం కిసాన్‌మేళా నిర్వహించారు. ‘సుస్థిర సేంద్రియ వ్యవసాయం–రైతాంగం ప్రగతికి సోపానం’ అనే అంశంపై చర్చించారు. కార్యక్రమం ప్రారంభంలో వ్యవసాయ పరిశోధన స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు కలిసి రైతాంగానికి అందిస్తున్న పరిశోధనా సేవలను సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎ.అప్పలస్వామి వివరించారు. విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకుడు డాక్టర్ జి.శివనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని 16 కృషి విజ్ఞాన కేంద్రాలు, 16 ఏరువాక కేంద్రాలు రైతులకు అవసరమైన సాగుసేవలు అందిస్తున్నట్టు వెల్లడించారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ శారదా జయలక్ష్మీదేవి మాట్లాడుతూ అతితక్కువ రసాయనాలతో సాగుచేసే దేశవాళీ వంగడాలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సుస్థిర సాగుకు కావలసిన పరిశోధనలు చేస్తామన్నారు. ఏఎంసీ చైర్మన్ కె.కళావతి మాట్లాడుతూ కేవీకే చేపట్టిన వివిధ శిక్షణ కార్యక్రమాలు, ప్రదర్శన క్షేత్రాలు, విజ్ఞాన యాత్రలు రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు. ఎమ్మెల్యే తోక జగదీశ్వరి మాట్లాడుతూ ఆరోగ్యకర పంటల సాగును ప్రోత్సహించాలని కోరారు. కిసాన్ మేళాలో పాలకొండ సబ్ కలెక్టర్ స్వప్నిల్ జగన్నాథ్, సర్పంచ్ అడ్డాకుల నరేష్, వివిధ గ్రామాలకు చెందిన 900 రైతులు, ఎఫ్‌పీఓ సభ్యులు, రైతు సాధికారిక సంస్థ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.


