ఆదుకుంటాం.. ఆందోళన వద్దు
జియ్యమ్మవలస రూరల్: తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు బాలికలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని శిశు సంక్షేమశాఖ మిషన్ వాత్సల్య విభాగం పేర్కొంది. ఇటీవల మండలంలోని వనజ గ్రామంలో తల్లి, తండ్రి, ఓ బాలుడు కుంపటి పొగతో విగత జీవులైన విషయం తెలిసిందే.. దీంతో ఆ కుటుంబంలో మరో ముగ్గురు బాలికలు అనాథలుగా మారారు. దీనిపై సాక్షిలో ‘పాపం పసివాళ్లు’ శీర్షికన శనివారం ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణి టి.కనకదుర్గ, సీడీపీఓ రజనీ దుర్గ ఆదేశాలు మేరకు శిశు సంక్షేమశాఖ మిషన్ వాత్సల్య విభాగం.. శనివారం వనజ గ్రామాన్ని సందర్శించింది. మీనక మాధురి, మోక్షి, ఆయుష్‌లను ఐసీడీఎస్ సంస్థ ద్వారా బాలసదన్‌లో జాయిన్ చేసి చదువుతోపాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొంది. పిల్లలు ముగ్గురూ ఒకే దగ్గర ఉండి చదువుకునే విధంగా చర్యలు తీసుకోవాలని తాత మీనక గౌరు కోరగా.. ఉన్నతాధికారులకు నివేదిస్తామని హామీ ఇచ్చారు. మిషన్ వాత్సల్య సభ్యులు జి.తవిటినాయుడు, టి.పైడిపునాయుడు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ జి.శ్రావణి, మహిళా కానిస్టేబుల్ చంద్రకళ ఉన్నారు.
ఆదుకుంటాం.. ఆందోళన వద్దు


