వైభవంగా కొండడాబాల యాత్ర
● జ్ఞానాపురం నుంచి వేలాది మంది భక్తుల పాదయాత్ర
● ముగిసిన నవదిన పూజలు
కొత్తవలస: మండలంలోని కొండడాబాల వ్యాకులమాత యాత్ర శనివారం వైభవంగా ప్రారభమైంది. విశాఖపట్నం జిల్లా జ్ఞానాపురం నుంచి వేలాది మంది భక్తులు పాదయాత్రగా కొండడాబాలకు చేరుకున్నారు. కనికరమాతను ప్రత్యేక వాహనంపై అలకంరించి తోడ్కుని వచ్చారు. ఎంతో చరిత్ర గల ఈ యాత్రకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటూ ఒడిశా, చత్తీస్‌ఘడ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తున్నారు. ఆదివారం ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి యాత్ర ముగుస్తుందని కొండడాబాల విచారణ కర్త గొంగాడ రాజు తెలిపారు.
ముగిసిన నవదిన ప్రార్ధనలు
వ్యాకులమాత పుణ్యక్షేత్రంలో గడిచిన తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న నవదిన ప్రార్ధనలు శనివారం రాత్రితో ముగిశాయి. యాత్ర ప్రారంభం కావడంతో కొండడాబాల ప్రాంతం అంతా పోలీస్‌ల ఆధీనంలోకి తీసుకున్నారు. 147 మంది సిబ్బంది, ఆరుగురు ఎస్‌ఐలు, ఇద్దరు సీఐలతో స్థానిక సీఐ షణ్ముఖరావు ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌కు ఎక్కడా అంతరాయం లేకుండా తగ జాగ్రత్తలను తీసుకున్నారు. వాహనాల పార్కింగ్ ప్రత్యేక స్థలాన్ని కేటాయించారు.


