పోలీసులపై డీఆర్‌ఓకు ఫిర్యాదు
విజయనగరం క్రైమ్: నా భర్తపై అక్రమంగా గంజాయి కేసు నమోదు చేసి పోలీసులు ఇబ్బందులకు పెట్టారంటూ విజయనగరంలోని పూల్‌బాగ్‌కు చెందిన సన్యాసిరావు భార్య మంగళవారం వాపోయింది. ఈ మేరకు బంధువులతో కలిసి కలెక్టరేట్ ముందు మంగళవారం ఆందోళన చేసిన ఆమె ఫిర్యాదు చేసేందుకు డీఆర్‌ఓను కలవగా కోర్టు పరిధిలో ఉన్నందున తామేమీ చేయలేమని ఆయన చెప్పడంతో నిశ్చేష్టురాలైంది. అన్యాయంగా తన భర్త సన్యాసిరావుపై కేజీన్నర గంజాయి తరలిస్తున్నాడంటూ తప్పుడు కేసు పెట్టి ఇంట్లో ఉన్న ఆయనను రూరల్ పోలీసులు బలవంతంగా తీసుకెళ్లిపోయారని ఫిర్యాదులో పేర్కొంది.నాలుగు రోజుల పాటు తన భర్త సన్యాసిరావు కోసం స్టేషన్ చుట్టూ తిరిగానని ఆవేదన వ్యక్తం చేసింది. ఇద్దరు పిల్లలతో ఉన్న తమ కుటుంబంపై అన్యాయంగా పోలీసులు ముద్ర వేశారని పేర్కొంది. బంధువులు, స్నేహితుల సాయంతో తన భర్త బెయిల్‌పై వచ్చాడని తనకు న్యాయం కావాలని డిమాండ్ చేసింది.


