రాజాంలో చోరీపై ముమ్మర దర్యాప్తు
రాజాం: రాజాంలోని జీఎంఆర్ ఐటీ క్వార్టర్స్‌లో ఆదివారం రాత్రి జరిగిన కిలోన్నర బంగారం, కిలో వెండి చోరీ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. జీఎంఆర్‌ఐటీ సమీపంలోని గ్రామాల్లో మంగళవారం ఆరాతీశారు. ఐటీ సమీపంలో బుచ్చింపేట రోడ్డులో ఓ వ్యక్తికి చెందిన పల్సర్ బైక్ చోరీ జరిగిన రాత్రి అపహరణకు గురికావడంపై కేసు నమోదుచేశారు. ఆ బైక్ దొంగతనానికి, ఈ చోరీకి మద్య ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. దొంగలను పట్టుకునేందుకు పది బృందాలు గాలిస్తున్నట్టు రాజాం రూరల్ సీఐ ఉపేంద్ర తెలిపారు. చోరీకి గురైన బైక్‌ను గుర్తించినవారికి పారితోషకం ఇస్తామని ప్రకటించారు.
భద్రతలో వైఫల్యమా...
పెద్దపెద్ద సెమినార్‌లు, కాన్వొకేషన్‌లు జరిగినప్పుడు కూడా బయట వ్యక్తులకు లోపలకు రానివ్వని జీఎంఆర్‌ఐటీ ప్రాంగణంలో ఇంత పెద్ద దొంగతనం ఎలా జరిగిందని ప్రస్తుతం మిస్టరీగా మారింది. సీసీ కెమెరాల నిఘా ఏమైంది.. సెక్యూరిటీ సిబ్బంది నిద్రపోతున్నారా అన్న చర్చ జోరందుకుంది. జీఎంఆర్ ఐటీ ప్రాంగణం 30 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. అక్కడే జీఎంఆర్ కేర్ డాక్టర్లకు, ఇటు జీఎంఆర్ ఐటీ ప్రొఫెసర్లకు క్వార్టర్స్ ఇచ్చారు. ఈ క్వార్టర్స్, కాలేజీలోకి వెళ్లాలంటే అడుగడుగునా జీఎంఆర్ ప్రైవేట్ సెక్యూరిటీ నిఘా ఉంటుంది. అయితే, తక్కువ ఎత్తులో ఉన్న ప్రహరీని దూకి క్వార్టర్స్‌లోకి దొంగలు ప్రవేశించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సీసీ కెమెరాలేవీ?
జీఎంఆర్ కేర్ ఆస్పత్రితో పాటు ఐటీ కాలేజీలు వద్ద సీసీ కెమెరాలు నిఘా ఉంది. ఈ క్వార్టర్స్ వద్ద ఈ సీసీ కెమెరాలు లేవు. రెండు ప్లాట్లులో చోరీ జరగగా ఒక ప్లాట్ వద్ద మాత్రమే సీసీ కెమెరా ఉంది. అందులో ముసుగుతో ఉన్నట్లు దొంగలు కనిపించారు. భారీగా బంగారం చోరీ జరిగిన రస క్వార్టర్స్ వద్ద మాత్రం ఒక్క సీసీ కెమెరా కూడా లేదు. ఆ క్వార్టర్సే కాకుండా చుట్టు పక్కల కూడా సీసీ కెమెరాలు లేకపోవడం గమనార్హం.
సెక్యూరిటీ ఏమైంది?
జీఎంఆర్ ఐటీ మెయిన్ గేట్, కాలేజీ బ్లాకులు, హా స్టల్స్, డీఏవీ స్కూల్స్ వద్ద జీఎంఆర్ రక్షా సెక్యూరిటీ ఉంటుంది. ఈ క్వార్టర్స్ వద్ద ఆ సెక్యూరిటీ గార్డులు ఉన్నారా? లేదా? అన్నది బయటకు రానివ్వలేదు. సెక్యూరిటీ గార్డులు అక్కడ ఉండి ఉంటే ఇంతటి చోరీ జరిగేదికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒక్కో క్వార్టర్‌లో 20 వరకూ గదులు ఉన్నా యి. ఈ గదులు అన్నీ ఒకదానికి ఒకటి ఆనుకుని ఉంటాయి. వీటిలో మనుషులు లేని ఇండ్లను దొంగలు ఎలా గుర్తించారు... అక్కడే ఎలా దొంగతనానికి దిగారు... గుప్‌చప్‌గా ఎలా మాయమయ్యారన్నది పోలీసులకు సైతం అంతుచిక్కడంలేదు.
ఇక్కడే గంజాయి విక్రయాలు..
జీఎంఆర్ ఐటీ సమీపంలోని బుచ్చింపేట రోడ్డులో గంజాయి విక్రయాలు జోరుగా జరిగేవి. ప్రధాన రహదారులపై గంజాయి బ్యాచ్‌లు గొడవలు వంటివి చోటుచేసుకున్నాయి. ఈ సమీపంలోనే ఇప్పుడు పెద్దచోరీ జరుగడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో చిన్నచిన్న దొంగతనాలకే భయబ్రాంతులకు గురయ్యే పట్టణవాసులు ఇప్పుడు ఈ భారీ చోరీని తలుచుకుని ఆందోళనచెందుతున్నారు.


