దేవుడా.. నీతోనే ఆటలా!
పార్వతీపురం పట్టణంలో బరి తెగింపు రద్దీ కూడళ్లలో ప్రజలను రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం భక్తుల మనోభావాలతో ఆటలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, మత విద్వేషాలను ప్రేరేపించేలా ఏర్పాటు చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు మాజీ ఎమ్మెల్యే జోగారావు ఫిర్యాదు
సాక్షి, పార్వతీపురం మన్యం:
కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవం.. కలియుగ శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై చేస్తున్న దుష్ప్రచారం పరాకాష్టకు చేరింది. కూటమి నాయకులు ఆరోపించినట్లుగా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఆనవాళ్లు లేవని సిట్ నిర్ధారించినప్పటికీ.. విష ప్రచారం ఆగడం లేదు. పార్వతీపురం జిల్లాకూ ఈ సంస్కృతి పాకింది. ఇన్నాళ్లూ నోటిమాట ద్వారానే తిరుమల లడ్డూకు అపఖ్యాతి ని తెచ్చారు. ఇప్పుడు మరో ముందుడుగు వేసి పార్వతీపురం పట్టణంలోని పలు రద్దీ కూడళ్లలో, భామిని వంటి మండల కేంద్రాల్లో సైతం పెద్ద ఎత్తున హోర్డింగులు ఏర్పాటు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా, మత విద్వేషాలను రెచ్చ గొట్టేలా.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వీటిని ఏర్పాటు చేయడం గమనార్హం. శ్రీనివాసుని లడ్డూ ప్రసాదంపై ఉన్న కళంకాన్ని పోగొట్టేలా ఇటీవల వైఎస్సార్‌సీపీ నాయకులు ‘పాప పరిహార పూజలు’ పేరిట వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం విదితమే. ఆ రెండు రోజులకే దీనికి కౌంటర్‌గా అన్నట్లు పార్వతీపురం పట్టణంలో హోర్డింగులు వెలిశాయి. ‘మహా పాపం నిజం.. అది నెయ్యే కాదు.. పామాయిల్, కెమికల్ కలిపిన ద్రవం’ అంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డిల ఫొటోలను ముద్రించి తప్పుడు ప్రచారంతో ఈ హోర్డింగులు వెలిశాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే తరహా హోర్డింగులు వెలియడం వెనుక.. పెద్ద ఎత్తున దురుద్దేశం ఉన్నట్లు కనిపిస్తోంది.
హిందువుల ఇష్టదైవం శ్రీనివాసుడు. స్వామి వారి లడ్డూ ప్రసాదం ఒక్కటి దొరికినా చాలు.. జన్మ ధన్యమని, మహా పుణ్యమని చాలా మంది భావిస్తారు. ఈ ప్రసాదం విషయంలో కల్తీ నెయ్యి కలిసిందంటూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విషప్రచారం చేస్తున్న విషయం విదితమే. అదే నిజమని భ్రమించేలా ఇప్పుడు ఏకంగా పెద్ద ఎత్తున హోర్డింగులు పెట్టడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. అల్లర్లు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ హోర్డింగులను కొంతమంది సామాజిక మాధ్యమాల్లో పనిగట్టుకుని వ్యాపింపజేస్తుండడం వారి అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
అతి పవిత్రమైన తిరుమల లడ్డూ నెయ్యి అంశం పట్ల వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు ప్రచారాలు, అపవాదులతో కూడిన ఫ్లెక్సీల ప్రచారాన్ని పోలీసు అధికారులు అడ్డుకోవాలని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు కోరారు. పట్టణంలో వెలసిన హోర్డింగులపై తక్షణం తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ.. పార్వతీపురం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో పార్టీ నాయకులతో కలిసి ఆయన సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జోగారావు మాట్లాడుతూ నెయ్యి కల్తీ అంశంపై సిట్ ఛార్జిషీట్‌కు వ్యతిరేకంగా.. జగన్‌మోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి ఫొటోలతో తప్పుడు పోస్టర్లను ఏర్పాటు చేశారని వివరించారు. ప్రజలను రెచ్చగొడుతూ, శాంతిభద్రతలకు భంగం కలిగేలా వాటిని సామాజిక మాధ్యమాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో సుమారు 18 నెలలుగా వంద కోట్ల మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బ తీయడమే కాక, ఈ విషయంలో వైఎస్సార్‌సీపీ నాయకులను నిందితులుగా చిత్రీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను పోలీసులు అడ్డుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ, సిట్ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను పరిశీలిస్తే.. పేర్కొన్న వ్యక్తులపై ఎలాంటి నేరారోపణలు, పాత్ర నిర్ధారణ, బాధ్యత విధింపు లేనట్లు స్పష్టమవుతోందని చెప్పారు. సిట్ దర్యాప్తు పూర్తిగా ల్యాబ్ నివేదికలు, డిజిటల్ ఫోరెన్సిక్ ఆధారాలు, పత్రాలు, చట్టబద్ధమైన సాక్ష్యాలపైనే సాగిందని తెలిపారు. రాజకీయ పార్టీలు, వ్యక్తుల ప్రమేయం ఉందని ఎక్కడా నిర్ధారించలేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వ నాయకులు భారత న్యాయ సమితి చట్టాలకు విరుద్ధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటిని పోలీసుశాఖ అడ్డుకోవాలని కోరారు. ఫ్లెక్సీలను తొలగించి, కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయనతోపాటు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


