ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటమా?
● ప్రభుత్వతీరుపై సచివాలయ ఉద్యోగుల ఆందోళన
విజయనగరం గంటస్తంభం: చంద్రబాబు ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోంది.. పరిమితిలేని పని గంటలు అప్పగిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతోందని పలువురు ఉద్యోగులు వాపోయారు. సచివాలయాల్లో పనిఒత్తిడిని తట్టుకోలేక, ఇతర కారణాలతో బలవంతపు మరణాలకు గురైన ఉద్యోగులను స్మరిస్తూ ఏపీఎన్జీఓ హోమ్‌లో సోమవారం కొవ్వొ త్తులు వెలిగించి నివాళులర్పించారు. మృతికి కారణమైన ప్రభుత్వ విధానాలపై డీయూ సేవ (డిస్ట్రిక్ అర్బన్ సచివాలయం ఎంప్లాయీస్ విజయనగరం అసోసియేషన్) ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘ నాయకులు పలువురు మాట్లాడుతూ సర్వేలు, ప్రత్యేక డ్యూటీలు, సంబంధం లేని శాఖల పనులు, మొబైల్ యాప్స్ భారం వల్ల సచివాలయ ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్నారన్నారు. ఉద్యోగుల సమ యం పూర్తయిన తరువాత కూడా పనిచేయాల్సి రావడం వల్ల కుటుంబానికి సమయం కేటాయించలేని పరిస్థితి నెలకొందని, ఈ ఒత్తిడి కారణంగా హార్ట్ స్ట్రోక్‌లు, మానసిక రుగ్మతలకు ఉద్యోగులు బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పని ఒత్తిడితో మరణించిన సచివాలయ ఉద్యోగులకు కనీస బెనిఫిట్స్ లేకపోవడం అత్యంత అమానుషమన్నారు. జీవించే హక్కు మాకు ఉందని, ఛిదిమేసే హక్కు మీకు ఎక్కడ ఉందంటూ ప్రశ్నించారు. ఉద్యోగులకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బలవంతపు మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటమా?


