వైభవంగా గోవిందుడి కల్యాణం
గరుగుబిల్లి: పవిత్ర నాగావళినదీ తీరాన స్వయంభూగా వెలసిన తోటపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. గురువారం సాయంత్రం 6 గంటలకు పద్మావతి, భూదేవి సహిత శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా, కనుల పండువగా నిర్వహించారు. కల్యాణం తిలకించేందుకు పరిసర గ్రామాలనుంచి భక్తులు అధికంగా తరలివచ్చారు. ప్రతి ఏటా మాఘశుద్ధ ఏకాదశి (భీష్మఏకాదశి)ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో శ్రీ వేంకటేశ్వరస్వామి, పద్మావతి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం సుప్రభాతసేవ, ఆరాధన, ధ్వజారోహణం, వాస్తు–యోగీశ్వరహోమం, విశేషహోమం, శాత్తుమురై తదితర క్రతువులను నిర్వహించిన అనంతరం ఎదురు సన్నాహోత్సవం, తిరువీధి మహోత్సవం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. బ్రహ్మశ్రీ జొన్నాడ భట్టరు హరికృష్ణమాచార్యులు, రేజేటి పార్థసారథి ఆచార్యులు, వీవీ.అప్పలాచార్యులతో శ్రీవేంకటేశ్వరస్వామి, ఉభయ దేవేరుల అంకురార్పణ, మహసంకల్పం, కన్యాదానం, మాంగళ్యధారణ, పాణిగ్రహణ మహోత్సవం వంటి శాస్త్రోక్తమైన ఘట్టాలతో స్వామివారి కల్యాణం వేడుకగా నిర్వహించారు. కల్యాణంలో పాల్గొన్న భక్తులకు కంకణాలను, స్వామివారి పూజసామగ్రిని అర్చకులు అందించారు. పార్వతీపురం, గరుగుబిల్లి, కురుపాం, సాలూరు, వీరఘట్టం తదితర ప్రాంతాలనుంచి దంపతులు స్వామివారి కల్యాణంలో పాల్గొని ఘనంగా జరిపించారు. కల్యాణం సందర్భంగా ఏర్పాటుచేసిన కోలాటం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. కల్యాణంలో ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి దంపతులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు దంపతులు, ఎంపీపీ ఉరిటి రామారావు దంపతులు, స్థానిక సర్పంచ్ ఆవాల సింహచలమమ్మ దంపతులు, నాయకులు అంబటి తవిటినాయుడు, అక్కేన మధుసూదనరావుతోపాటు పలువురు పాల్గొన్నారు. కల్యాణంలో పూజల్లో పాల్గొన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈఓ బి.శ్రీనివాసరావు, ఆలయ చైర్మన్ ఎం.పకీరునాయుడు, ధర్మకర్తలమండలి సభ్యులు, టీటీడీఎస్ సభ్యులు, సిబ్బంది అవసరమైన ఏర్పాట్లు చేశారు.
వైభవంగా గోవిందుడి కల్యాణం


