కల్యాణ వైభోగమే..
నెల్లిమర్ల రూరల్: మంగళవాయిద్యాలు.. వేదపండితుల మంత్రోచ్ఛారణలు.. భక్తుల జయజయ ధ్వా నాల నడుమ రామతీర్థం పుణ్యక్షేత్రంలో సీతారామస్వామి వారి వార్షిక కల్యాణం గురువారం రాత్రి కమనీయంగా జరిగింది. కల్యాణాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రఘురాముని కల్యాణ వేడుకను కనులారా తిలకించి పరవశించిపోయారు. పవిత్ర దినమైన భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని సీతారామస్వామి వారి తిరుక్కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
వేకువజాము నుంచే...
రామతీర్థం సీతారామస్వామి ఆలయంలో వేకువజాము నుంచే కల్యాణ మహోత్సవ సందడి ప్రారంభమైంది. రామకోనేరు పవిత్ర జలంతో ఆలయాన్ని శుద్ధి చేశారు. ఉదయం 8 గంటలకు శ్రీమద్రామాయణ పారాయణం, వేద పఠనం, తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం యాగశాలలో విశేష హోమాలు జరిపించారు. సాయంత్రం 5 గంటలకు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్టాపన, గ్రామ బలిహరణం నిర్వహించారు. సరిగ్గా రాత్రి 8.30 గంటలకి అర్చకుల వేదమంత్రాలు, మంగల వాయిద్యాల నడుమ సీతమ్మ వారి శిరస్సుపైన జీలకర్ర బెల్లం పెట్టించి సీతారాముల తిరుక్కల్యాణాన్ని వైభవోపేతంగా జరిపించారు.


