పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు : కలెక్టర్
గరుగుబిల్లి: పర్యాటక రంగ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడుతున్నట్టు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అన్నారు. మండలంలోని తోటపల్లి కుడిమట్టి కట్ట ప్రాంతంలో వున్న ఐటీడీఏ పార్క్‌ను, బోటు షికారును ఆయన జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోటపల్లి ప్రాజెక్టు పరిసరాలు పర్యా టక రంగం అభివృద్ధికి ఎంతో అనుకూలంగా ఉందన్నారు. ఈ ప్రాంతంలో పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించి పర్యాటకులను ఆకర్షించేలా చేసేందుకు అవసరమైన ప్రణాళికలు చేసి ప్రభుత్వానికి నివేదించనున్నట్టు తెలిపారు. ప్రకృతి ఒడిలో మట్టితో సరదాగా గడిపేలా వినూత్నమైన మడ్ పార్క్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు చేయడం జరుగుతుందన్నారు. కాలువల వెంబడి బోటింగ్ చేస్తూ ప్రకృతిని ఆస్వాదించేలా కల్పించేలా అవసరమైన చర్యలు చేపడతామన్నారు. పర్యాటక ప్రాంతానికి సులభంగా చేరు కొనేందుకు అవసరమైన రవాణా వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు ఈ ప్రాంతంలో బస చేసేందుకు వసతిగృహల నిర్మాణం చేపట్టేలా ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా తోటపల్లి ప్రాజెక్టు గర్భంలో కొద్దిసేపు బోటు షికారు చేస్తూ ఆనందంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గడిపారు. ఐటీడీఏ ఇంజినీరింగ్ అధికారులున్నారు.


