నా ఓటమి సత్తెనపల్లి రూరల్‌ సీఐకి అంకితం | - | Sakshi
Sakshi News home page

నా ఓటమి సత్తెనపల్లి రూరల్‌ సీఐకి అంకితం

Nov 10 2026 1:49 AM | Updated on Nov 10 2026 1:49 AM

● రాజీ పడితే సొంత ఇంటి వాడినవుతానంటూ.. ● రూరల్‌ సీఐ కిరణ్‌ మధ్యవర్తిత్వం

ముప్పాళ్ల: ‘నా ఓటమి సత్తెనపల్లి రూరల్‌ సీఐకు అంకితం’ ఇస్తున్నట్లు వైఎస్సార్‌ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి మధిర శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘నాకు ఇంత వరకు సొంత ఇల్లు లేదు.. మీరు సహకరించి పోటీ నుంచి తప్పుకుంటే.. పోటీ ఉండదు.. వచ్చిన డబ్బులతో నేను గుంటూరులో ఒక ఇల్లు కట్టుకొని సొంత ఇంటి వాడిని అవుతానంటూ’ సత్తెనపల్లి రూరల్‌ సీఐ కిరణ్‌ జనసేన అభ్యర్థి పెట్టిన ఆశలకు ప్రలోభపడ్డారని చెప్పారు. స్టేషన్‌కు పిలిపించి రాజీ ప్రయత్నం చేశాడని పేర్కొన్నారు. మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకుగాను కూటమి నాయకుల దాడులతో కేవలం ఐదు చోట్ల మాత్రమే వైఎస్సార్‌ సీపీ పోటీలో ఉండాల్సి వచ్చిందని చెప్పారు. ఎన్నికల్లో ఎక్కడా ప్రశాంతంగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోలేదని పేర్కొన్నారు. రూట్‌ ఆఫీసర్‌ అయినప్పటికీ చాగంటివారిపాలెం పోలింగ్‌ కేంద్రం వద్దే ఉంటూ పోలీసులు, అధికారుల సహకారంతో అధికార టీడీపీ నాయకులు యథేచ్ఛగా రిగ్గింగ్‌, రీసైక్లింగ్‌ చేసుకున్నారని ఆరోపించారు. రూరల్‌ సీఐ, ఎస్‌ఐ అనిల్‌ కుమార్‌ ఎన్నికల రోజు వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లు లేకుండా ముందు రోజు రాత్రే అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించి కూటమి నాయకులకు అండగా నిలిచారన్నారు. ప్రధానంగా సీఐ కిరణ్‌ ఎన్నికల్లో పూర్తిగా టీడీపీకి వారికి సహకరించి రిగ్గింగ్‌ చేసుకునేందుకు కారణమయ్యారన్నారు. తన ఓటమితో పాటు మండలంలోని వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల ఓటమికి సీఐ కారణమన్నారు. నామినేషన్‌ దాఖలు సమయంలోనూ అభ్యర్థులపై దాడి చేస్తున్నా పట్టించుకోలేదని చెప్పారు. ఎన్నికల ప్రచారం కోసం దరఖాస్తు చేసుకున్న అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టాడని వివరించారు. ఎన్నికల రోజు అభ్యర్థులను కేంద్రంలోకి వెళ్లనివ్వలేదని, జిల్లా ఎస్పీని కలిసి చెప్పినా కూడా ఇష్టానుసారంగా వ్యవహరించాడని, రక్షణగా ఉండాల్సిన పోలీసులే ఇలా పనిచేస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదని పేర్కొన్నారు. పోలింగ్‌ బూత్లో ఉన్న ఏజెంట్లను కూడా భయపెట్టాడని, పోలింగ్‌ కేంద్రానికి ఎదురుగా ఉన్న పెళ్లి మండపంలోనూ చొరబడి పెళ్లికి వచ్చిన వారి పైన లాఠీచార్జి చేశాడని, ఒక మహిళను బలవంతంగా పోలీస్‌ స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశాడని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement