మాజీ మంత్రి విడదల
చిలకలూరిపేట: రిగ్గింగ్‌లు, దౌర్జన్యాలతో గెలిచిన దాన్ని గెలుపు అంటారా? చిలకలూరిపేటలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి విజయం సాధించడం సరైన పద్ధతి కాదని మాజీ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. చిలకలూరిపేటలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంగళవారం విడదల రజిని ఆమె కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ సాగించిన అరాచకాలు ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చగా మారాయని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల రోజు పోలింగ్ బూత్‌ల ఆక్రమణలు, రిగ్గింగ్‌లు, దొంగ ఓట్ల ఆరోపణలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన టీడీపీ శ్రేణులు, కౌంటింగ్ రోజు కూడా కౌంటింగ్ ఏజెంట్లపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతూ తమ అరాచకాన్ని కొనసాగించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల రోజు ఓట్లపై దాడి, కౌంటింగ్ రోజు ప్రజాస్వామ్యంపై దాడి! ఇదేనా తెలుగుదేశం పార్టీ చెప్పే ప్రజాస్వామ్యం? ఇష్టానుసారంగా రిగ్గింగ్‌లు చేసుకుని, కౌంటింగ్ కేంద్రాలను ఆక్రమించి, కౌంటింగ్ ఏజెంట్లపై దాడులు చేస్తూ, తమకు నచ్చిన ఫలితాలను ప్రకటించుకుంటే దానిని ప్రజా విజయమని ఎలా చెప్పుకుంటారని విడదల రజిని ప్రశ్నించారు. ప్రత్తిపాటి పుల్లారావు అనుచరులు కౌంటింగ్ కేంద్రాల వద్ద దౌర్జన్యాలకు పాల్పడుతూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌంటింగ్ ఏజెంట్లను అడ్డుకోవడం, వారిపై దాడులు చేయడం వంటి ఘటనలు ఎన్నికల ప్రక్రియ పారదర్శకతపై తీవ్ర సందేహాలను రేకెత్తిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సిన బాధ్యతను విస్మరించి, ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి రాజకీయ ఆధిపత్యం ప్రదర్శించాలనుకోవడం అధికార అహంకారానికి పరాకాష్ట అని ఆరోపించారు. చిలకలూరిపేట రాజకీయాల్లో టీడీపీ ఒక విష సంస్కృతిని తీసుకొచ్చిందన్నారు. ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవాల్సింది పోయి, భయపెట్టడం, దాడులు చేయడం, ప్రత్యర్థుల గొంతు నొక్కడం ద్వారా గెలవాలనుకోవడం సిగ్గుచేటు అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం, కానీ ప్రజల తీర్పును గౌరవించకుండా, ఎన్నికల ప్రక్రియను తమకు అనుకూలంగా మలుచుకోవాలనే ధోరణి ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని విడదల రజిని స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో జరిగిన దాడులు, దౌర్జన్యాలపై ఎన్నికల అధికారులు తక్షణమే స్పందించాలని, జరిగిన ఘటనలను సమగ్రంగా పరిశీలించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.


