● జనజీవనం అస్తవ్యస్తం ● నీట మునిగిన సత్తెనపల్లిలోని లోతట్టు ప్రాంతాలు ● నాగన్నకుంటలో బిక్కుబిక్కుమంటున్న ప్రజలు
● జిల్లాలో తుఫాన్ ప్రభావంతో భీకర గాలులు ● ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం ● నేలకొరిగిన భారీ వృక్షాలు, స్తంభాలు
సత్తెనపల్లి: మురసు తుఫాన్ జిల్లా ప్రజలను వణికించింది. పెనుగాలులు, భారీవర్షాలతో జిల్లా వాసులను హడలెత్తిస్తోంది. జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచే భీకర గాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కుండపోతగా భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది.
పెనుగాలుల ప్రతాపం
సోమవారం ఎలాంటి మబ్బులు లేకుండా ఆకాశం నిర్మలంగా కనిపించింది. రాత్రి నుంచి వాతావరణంలో మార్పు వచ్చింది. ఆ సమయంలో సాధారణంగా మొదలైన గాలులు ప్రచండ వేగంతో భయం గొలిపేలా మారాయి. గంటకు 120 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వీచాయి. పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. సత్తెనపల్లి మండలం రామకృష్ణపురం వద్ద భారీ వృక్షం గుంటూరు–మాచర్ల ప్రధాన జాతీయ రహదారిపై కూలిపోవడంతో ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచిపోయింది. పోలీసులు ఆ వృక్షాన్ని తొలగించేందుకు శ్రమించారు. రోడ్డుపై కూడా నిలబడే పరిస్థితి లేకుండా గాలులు వీయడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. సత్తెనపల్లి పట్టణంలో ఐదు విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. మంగళవారం సాయంత్రం పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు చీకట్లో చిక్కుకున్నారు. సత్తెనపల్లిలోని నాగన్నకుంట, సుందరయ్య కాలనీ, శాలివాహనగర్, దోబీఘాట్‌తో పాటు 8వ వార్డు తదితర ప్రాంతాల్లో ఐదు అడుగుల మేర ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. సత్తెనపల్లిలో 169.8 మీ.మీ.వర్షపాతం నమోదైంది.
యడ్లపాడులో ఇద్దరు గల్లంతు
యడ్లపాడు: మురసు తుఫాన్ మండలంలో తీవ్ర ప్రభావం చూపింది. సొలస, చెంగిస్ ఖాన్ పేట, లింగారావుపాలెం, జగ్గాపురం, దింతనపాడు కారు చోల, జాలాది, బోయపాలెం, సందెపూడి, తుర్లపాడు తదితర గ్రామాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో భారీగా ఇళ్లలోకి చేరింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సొలస, లింగారావుపాలెం, మైదవోలు, సందెపూడి, తుర్లపాడు, వేలూరు, జాలాది, గణేశుని వారి పాలెం గ్రామాల మధ్య రహదారులపై భారీగా వరద నీరు చేరింది. రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. జాలాది గ్రామంలో కారు వరద నీటిలో కొట్టుకుపోవడంతో గ్రామస్తులు అతి కష్టంతో తీసుకు వచ్చారు. ఆయా చేలల్లో భారీగా నీరు నిలిచి పంటనష్టం వాటిల్లింది. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాన్ని అధికారులు రప్పించారు. ఉన్నవ గ్రామంలో ఓ ఇల్లు కూలింది. ప్రాణనష్టం జరగలేదు. నక్క వాగు వద్ద ఉన్న లిఫ్ట్ పంపు హౌస్ వద్ద నలుగురు వాగులో చిక్కుకోగా సహాయక చర్యలు చేపట్టారు. తిమ్మాపురం కొత్త బైపాస్ అండర్ పాస్ వంతెన ఇరువైపుల రహదారులు జలమయం కావడంతో అక్కడ ఏడుగురు చిక్కుకొన్నారు. వారిలో ఐదుగురిని కాపాడారు. మరో ఇద్దరు గల్లంతు అయ్యారు. సంగం గోపాలపురం వద్ద రోడ్డుపై రెండు, మండల పరిషత్ కార్యాలయం సమీపంలో మరో చెట్టు కూలింది. విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు.


