కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచే పోలీసులను అడ్డుపెట్టుకొని అరాచకాలు వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వజం ప్రజలకు మంచి చేసి ఉంటే నామినేషన్లను అడ్డుకోవడం ఎందుకు? వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి
చిలకలూరిపేట: మాజీ మంత్రి విడదల రజినిని హత్య చేసేందుకు ప్రయత్నించారని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మహిళా ఎస్‌ఐ లేఖా ప్రియాంక ఉద్దేశపూర్వకంగా తోసివేశారని, ఈ తోపులాటలో పక్కనే ఉన్న గ్రానైట్ అరుగు మాజీ మంత్రి తలకు తగిలి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎవరి ఆదేశాలతో జరిగిందో నిగ్గు తేలుస్తామని అన్నారు. మహిళా ఎస్‌ఐ దౌర్జన్యానికి పాల్పడిన నేపథ్యంలో మాజీ మంత్రి గాయపడిన సంఘటన విదితమే. ఈ నేపథ్యంలో శనివారం నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డితో కలిసి పిన్నెల్లి చిలకలూరిపేటలోని మాజీ మంత్రి నివాసానికి వచ్చి ఆమెను పరామర్శించారు.
తొలి రోజు నుంచే దారుణాలు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇప్పటి వరకు ఎన్నికల చరిత్రలో చూడని విధంగా స్థానిక ఎన్నికల్లో పోలీసులను ముందుపెట్టి, వెనుక టీడీపీ గూండాలు, గంజాయి బ్యాచ్, గ్రానైట్ పరిశ్రమల్లో పనిచేసే బిహార్ బ్యాచ్‌లతో అరాచకాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యడ్లపాడు ఎంపీటీసీ అభ్యర్థి గొంతు కోసే ప్రయత్నం జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజాతీర్పు వ్యతిరేకంగా వస్తుందన్న ఉద్దేశంతోనే నామినేషన్లు కూడా వేయకుండా దారుణాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ముసుగులు వేసుకొని తమ పార్టీ వారి గొంతు కోసేందుకు సైతం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేస్తామని చెప్పిన అభ్యర్థుల ఇళ్లకు పోలీసులే వచ్చి గంజాయి కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇంత దారుణంగా పోలీసులకు దిశానిర్దేశం చేసి పంపిన వారికి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జ్యూడీషియల్ ఎంకై ్వరీ వేయించి, తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
మంచి చేసి ఉంటే భయమెందుకు?
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చామని, అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేస్తే భయమెందుకని ప్రశ్నించారు. మంచి చేసి ఉంటే ప్రజలే మీకు అండగా ఉండి గెలిపిస్తారు కదా, ప్రతిపక్ష పార్టీని నామినేషన్ కూడా వేయనివ్వకుండా అడ్డుకోవడం ఎందుకని నిలదీశారు. అలాంటప్పుడు కొత్త జీవో పాస్ చేసి పదవులను నామినేటెడ్ ప్రాతిపదికన ఇచ్చుకోవచ్చు కదా, ఎన్నికలు పెట్టి ఘోరాలకు పాల్పడటం ఎందుకని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెట్టిన రాజకీయ భిక్షతో ఎదిగిన నరసరావుపేట ఎంపీ ఇలాంటి దౌర్జన్యాలకు మూలస్తంభంగా నిలుస్తున్నారని ఆరోపించారు. 2029లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజే నేడు దౌర్జన్యంగా నామినేషన్లను అడ్డుకొని అక్రమ మార్గంలో ఎన్నికై న వారితో రాజీనామాలు చేయిస్తామన్నారు. దౌర్జన్యకారులంతా ఇళ్లకు వెళ్లాల్సిందేనని ఆయన హెచ్చరించారు.
మాజీ మంత్రిపైనే ఇంత దౌర్జన్యమా?
సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి మాట్లాడుతూ, బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని నడుపుతోందని విమర్శించారు. ఒక సాధారణ ఎస్‌ఐ మాజీ మంత్రిపై దౌర్జన్యానికి పాల్పడే సాహసం చేశారంటే, దీని వెనుక బలమైన శక్తులు ఎవరైనా ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్... వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తీవ్ర విమర్శలు చేసేవారని, ఎన్నో ప్రశ్నలు వేసేవారన్నారు. ఇప్పుడు జరుగుతున్న దౌర్జన్యాలపై ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. కూటమిలో ఉన్న జనసేన నాయకులనే టీడీపీ వాళ్లు కొడితే, దీనిని కూడా ప్రశ్నించలేని స్థితిలో పవన్ కల్యాణ్ ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి విడదల రజిని, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.


