టీడీపీ హింసాకాండకు బెదరం ప్రజలను చైతన్యపరిచి గెలుస్తాం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పీఆర్కే
పోటీ చేస్తేనే కదా సత్తా తెలిసేది...
‘రెడ్ బుక్’ అరాచకాలను
మాచర్ల: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, తాము ఎన్నికల బరిలో నిలిచి పోరాటం కొనసాగిస్తామని వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. స్థానిక ఎన్నికలలో ఓటమి భయంతోనే సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ఆధ్వర్యంలో హింసాకాండను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. పోలీసులను అడ్డం పెట్టుకొని అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మహిళలు అని కూడా చూడకుండా అత్యంత దారుణంగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గూండాయిజంపై ప్రజలను చైతన్యపరుస్తామని తెలిపారు. శనివారం పీఆర్కే విలేకరులతో మాట్లాడుతూ... జిల్లాలో అరాచకాలకు పాల్పడి ఏకగ్రీవాలు చేసుకోవడం కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి వెళ్లకుండా టీడీపీ వారు అడ్డుకుంటున్నారని అన్నారు. నరసరావుపేటలోని అన్ని మండల కేంద్రాల్లో ఎంపీడీవో కార్యాలయాల వద్ద టీడీపీ గూండాలను మోహరించి, పోలీసుల అండతో మూడు రోజులుగా అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
నకిలీ నామినేషన్లు
పైగా, కోర్టుల్లో కేసులు వేసి న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తారనే భయంతో ఆయా మండలాల్లో 14 ఫేక్ నామినేషన్లు వేయించారని అన్నారు. వైఎస్సార్ సీపీ కండువాలు కప్పుకొని తెలుగుదేశం నాయకులు దుర్మార్గంగా వ్యవహరించారన్నారు. వారికి మద్దతు పలుకుతూ స్వయంగా పోలీసులే వారితో నామినేషన్లు దాఖలు చేయించారని ఆరోపించారు. సాక్షి మీడియాకు చెందిన ముగ్గురు వ్యక్తులపై మాచర్ల ఎంపీడీవో కార్యాలయం ముందు తెలుగుదేశం గూండాలు అత్యంత దారుణంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి సెల్‌ఫోన్లు లాక్కొని పైశాచికంగా ప్రవర్తించారని అన్నారు. దౌర్జన్యానికి పాల్పడిన వారిపై పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోకుండా, మీడియా ప్రతినిధులకే హుకుం జారీ చేయడం దారుణమన్నారు. ఇప్పటికీ వారి సెల్‌ఫోన్లు ఎవరి దగ్గర ఉన్నాయో కూడా పోలీసులు కనిపెట్టలేకపోవడం దారుణమన్నారు. పేరుకు నియోజకవర్గంలో 144 సెక్షన్ విధించి, తెలుగుదేశం పార్టీకి మినహా అందరికీ ఈ సెక్షన్ వర్తిస్తుందని చెబుతున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీని లక్ష్యంగా చేసుకొని, పోలీసు లాఠీలను అడ్డం పెట్టుకొని పైశాచికంగా దాడులు చేస్తున్నారని తెలిపారు. మహిళలపై దాడులకు పాల్పడుతూ అసభ్యంగా వ్యవహరిస్తున్నా పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. 2029లో అధికారంలోకి వచ్చాక, తెలుగుదేశం పార్టీ గూండాలకు అండగా నిలిచి దారుణాలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని, వివక్షతో వ్యవహరించిన ప్రతి అధికారి చరిత్రను రికార్డు చేస్తామని అన్నారు.
మాచర్ల నియోజకవర్గంలో తాము ఎన్నికలు నిర్వహించినప్పుడు ప్రశాంతంగానే నామినేషన్లు వేయించామని పిన్నెలతెలిపారు. గతంలో స్థానిక ఎన్నికల సమయంలో టీడీపీ వారే బహిష్కరిస్తున్నామని చెబుతూ దూరంగా ఉన్నారని అన్నారు. చంద్రబాబు సైతం తమకు స్థానిక ఎన్నికలతో పనిలేదని చెప్పారని గుర్తుచేశారు. ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను, అభిమానాన్ని పెంచుకోవడానికి, కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తెలియజేయడానికి స్థానిక ఎన్నికల బరిలో నిలబడుతున్నామని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేక పోలీసులను అడ్డం పెట్టుకొని మహిళలు, యువకులు, వృద్ధులు అనే తేడా లేకుండా అందరినీ టీడీపీ వారు బెదిరిస్తున్నారని ఆరోపించారు. నామినేషన్ పత్రాలను చించడం, దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్న ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. ప్రజలే తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుందని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ నాయకులందరినీ హౌస్ అరెస్టు చేసి, రాజకీయాలు చేసినంత మాత్రాన ప్రజల్లో అభిమానం పొందలేరన్నారు. తమ పార్టీ అభ్యర్థులందరినీ పోటీ చేయించాలని, అప్పుడు ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందని అన్నారు. ఆ సత్తా లేకే ఇంతటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తామని పేర్కొన్నారు. చివరికి ఫేక్ అభ్యర్థులను నిలబెట్టిన చరిత్రతో కొత్త డ్రామాలకు తెరతీశారని విమర్శించారు. తమ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.


