పిడుగురాళ్ల: పోలీస్ రక్షణతో నామినేషన్ వేసే అవకాశం కల్పించాలని పిడుగురాళ్ల వైఎస్సార్ సీపీ చైర్మన్ అభ్యర్థి షేక్ అబ్దుల్లా కోర్టును ఆశ్రయించారు. ఆ మేరకు అనుమతి రావడంతో పార్టీ పల్నాడు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షురాలు మాధవి సమక్షంలో పిడుగురాళ్ల మున్సిపల్ కార్యాలయం వద్ద ఆదివారం నామినేషన్ వేసేందుకు హాజరయ్యారు. అప్పటికే కాపుకాసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో అబ్దుల్లా వాహనాన్ని అడ్డుకున్నారు. అక్కడ కొంత సమయం వృథా అయింది. కోర్టు ఉత్తర్వుల మేరకు పోలీసుల రక్షణతో ఆయన నామినేషన్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఈ లోగా సమయం అయిపోయిందని, నామినేషన్ వేసే అవకాశం లేదని అధికారులు పేర్కొనడంతో ఆయన వెనుదిరిగారు.
అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు
నామినేషన్ వేసేందుకు వైఎస్సార్ సీపీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఉండగా ఒక్కసారిగా సీఐ శ్రీరాం వెంకట్రావు ఆధ్వర్యంలో పోలీసులు వచ్చి భయభ్రాంతులకు గురి చేశారు. కర్రలు, రాళ్లు ఉన్నాయని పేర్కొంటూ అంతా సోదా చేయించారు. ఏమీ దొరకలేదు. కౌన్సిలర్ అభ్యర్థులను బయటకు పంపించారు. అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. కౌన్సిలర్ అభ్యర్థులపై కూటమి ప్రభుత్వం కావాలనే పోలీసులను అడ్డు పెట్టుకొని నామినేషన్ వేయనీలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. పట్టణ చరిత్రలో ఇలాంటి ఘటన జరగడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.


