గురజాల: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా ఖాకీల అండతో కూటమి నాయకులు అడ్డంకులు సృష్టించారు. పట్టణంలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున అభ్యర్థులు మాత్రమే వెళ్లి నామినేషన్ వేయాలని పోలీసులు వైఎస్సార్ సీపీ పార్టీ కార్యాలయానికి వచ్చి హుకుం జారీ చేశారు. పార్టీ పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకుడు యెనుముల మురళీధర్‌రెడ్డి తమ అభ్యర్థులపై దాడికి కూటమి నేతలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తోడుగా వెళ్లి నామినేషన్ వేసి వస్తామని పోలీసులకు తెలిపారు. పట్టణ సీఐ మురళి అందుకు అంగీకరించలేదు. దీంతో పార్టీ కార్యాలయం వద్దే కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. తర్వాత నామినేషన్ కేంద్రానికి వెళ్తున్న వారిని బలవంతంగా వ్యానులో ఎక్కించి కొందర్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. యెనుముల మురళీధర్‌రెడ్డిని పార్టీ కార్యాలయంలోకి తీసుకువెళ్లి హౌస్ అరెస్టు చేశారు. మిగిలిన నాయకులు, కార్యకర్తలను పార్టీ కార్యాలయంలోనే ఉంచారు. బయట సుమారుగా 40 మందికి పైగా పోలీసులు కాపలా కాశారు. యెనుముల మురళీధర్‌రెడ్డి, మాచర్ల నియోజకవర్గ పరిశీలకుడు కొమ్మినేని వెంకటేశ్వర్లు (కేవీ)ల నివాసాల వద్ద కూడా బందోబస్తు నిర్వహించారు. జంగమహేశ్వరపురంలో పోలీసులు ప్రతి ఇంటిని జల్లెడ పట్టి నాయకులను హౌస్ అరెస్టు చేశారు.


