నాచీరకం అంటగట్టారు! | - | Sakshi
Sakshi News home page

నాచీరకం అంటగట్టారు!

Sep 28 2026 7:45 AM | Updated on Sep 28 2026 7:45 AM

నాచీరకం అంటగట్టారు!

చీరల నాణ్యత, రంగు బాగాలేదు

యూనిఫాం పేరుతో నాణ్యత లేని చీరల పంపిణీ అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు ఇబ్బందులు రూ. వంద ఖరీదైనవి రూ.500గా ప్రకటన జిల్లాలో 3,990 మందికి అందించిన చంద్రబాబు సర్కార్‌

మరీ తక్కువ రకంగా ఉన్నాయి

చంద్రబాబు ప్రభుత్వంలో పథకం ఏదైనా అందిన కాడికి దోచుకోవడమే లక్ష్యంగా టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు యూనిఫాం పేరిట ఇటీవల పంపిణీ చేసిన చీరలే ఇందుకు నిదర్శనం. ఒకట్రెండు ఉతుకులకే చిరిగిపోయి మరోసారి కట్టుకోవడానికి వీలులేనంతగా తయారయ్యేలా ఉండడంతో సిబ్బంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రూ.వంద కూడా విలువ చేయని చీరను రూ. ఐదు వందలకు అంటగట్టారని ఆరోపణలు వస్తున్నాయి. కాంట్రాక్టర్‌ రూ. రెండు వందలు మిగిల్చుకుంటే, అంతే మొత్తం టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లిపోయాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు పంపిణీ చేసిన చీరల నాణ్యత, రంగు బాగాలేదని చెబుతున్నారు. జిల్లాలో చీరలు పంపిణీ చేసినప్పటికీ వాటిని కార్యకర్తలు ఓపెన్‌ చేయలేదు. ఎమ్మెల్యేల ద్వారా పంపిణీ ప్రారంభించే వరకు వాడొద్దని చెప్పి పక్కన పెట్టమన్నారు. వినుకొండ పరిధిలో ఆ చీరలను ఇంకా తీసుకోలేదు.

– ఏఎల్‌ ప్రసన్న,

సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు, పల్నాడు

సత్తెనపల్లి: జిల్లాలో చిరుద్యోగులకు పలు పథకాలను అమలు చేస్తున్నామంటూ అందిన కాడికి దండుకోవడమే టీడీపీ నాయకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. యూనిఫాం పేరుతో అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు పంపిణీ చేస్తున్న చీరలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. జిల్లాలోని 9 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 2,031 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 2,031 మంది కార్యకర్తల పోస్టులకు గాను 1,995 మంది... 2,031 మంది సహాయకుల పోస్టులకు గాను 1,995 మంది ప్రస్తుతం పని చేస్తున్నారు. ఒక్కొక్కరికి రెండేసి చొప్పున మొత్తం 7,980 చీరలను రూ.500 లెక్కన పంపిణీ చేశారు. ఈ లెక్కన ఒక్కో చీరకు రూ.400 మిగిలినా రూ.31.92 లక్షలు వరకు కాంట్రాక్టర్‌, టీడీపీ నేతలు పంచుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఇచ్చే దుస్తుల్లోనూ కక్కుర్తి పడుతున్న ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నాణ్యత శూన్యం

అంగన్‌వాడీలకు చీరలు సరఫరా చేసే భారీ టెండర్‌ను రాష్ట్ర వ్యాప్తంగా ‘పచ్చ’ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టడం వెనుక పెద్ద వ్యవహారమే నడిచినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ పార్టీ రంగు అయిన పసుపు రంగు ప్రదర్శించుకోవాలనే తాపత్రయం తప్ప వస్త్రం నాణ్యతపైనా, పరిమాణంపైనా కనీస శ్రద్ధ తీసుకోలేదు. మూడేళ్ల క్రితం అప్పటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు, సహాయకులకు ఒక్కొక్కరికి ఒకేసారి ఆరు చీరలు, ఆరు జాకెట్లు అందజేశారు. వాటిని చూసిన అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు సంతోషంగా తీసుకున్నారు. నేటికీ అనేక మంది వాటినే కట్టుకుంటూ ఉండటం గమనార్హం. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లకు ఒక్కొక్కరికి రెండు చీరలు మాత్రమే రంగు, డిజైన్‌ మార్చేసి సరఫరా చేశారు. కార్యకర్తలకు పసుపు పచ్చరంగు చీర, సహాయకులకు మెరూన్‌ రంగు చీర అందజేశారు. గత ప్రభుత్వంలో అందజేసిన చీరలతో పోలిస్తే నాణ్యత నాసిరకంగా ఉందని, కొలతల్లో చాలా తేడా ఉందని అంగన్‌వాడీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అందించిన చీర కొలత 5.5 మీటర్లు ఉండగా.. ప్రస్తుతం అందించిన చీర కొలత 4.5 మీటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. చాలీచాలని చీరలను కట్టుకుని ఏ విధంగా విధులకు హాజరు కావాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాంట్రాక్టర్‌కు అండదండలు

ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్లతో విజయవాడలో ఇటీవల నిర్వహించిన సమావేశంలో ఈ నాణ్యత లేని చీరల అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. చాలా నాసిరకంగా ఉన్నాయన్న విమర్శలు రావడంతో వాటి పంపిణీని నిలిపివేయాలని, ఇప్పటికే ఇచ్చిన వాటిని వెనక్కి తీసుకోవాలని ఉన్నతాధికారులు చెప్పినట్లు తెలిసింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి పంపిణీ చేసే యూనిఫాంను కూడా పరిశీలించే తీరిక పాలకులకు, ఆ శాఖ ఉన్నతాధికారులకు లేదా అనే సందేహం అందరిలోనూ వ్యక్తమవుతోంది. చిరుద్యోగులకు ప్రభుత్వం పంపిణీ చేసే చీరల్లోనూ కక్కుర్తి పడిన కాంట్రాక్టర్‌ను కూటమి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులే వెనకేసుకొస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా పాలకులు స్పందించి కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవడంతోపాటు నాణ్యమైన చీరలు పంపిణీ చేయాలని అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల సంఘం నాయకులు కోరుతున్నారు. కమీషన్ల కోసం ఇలా నిరంతరం విధుల్లో ఉండే మహిళలకు నాసిరకం చీరలు పంపిణీ చేస్తే ఎలా అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అంగన్‌వాడీ కార్యకర్తలకు పసుపు రంగు, సహాయకులకు మెరూన్‌ రంగు చీరలను పంపిణీ చేశారు. చీరలు నాసిరకంగా ఉన్నాయి. ఒక్కో ప్రాజెక్ట్‌లో ఒక్కో రకంగా పంపిణీ జరిగింది. పిడుగురాళ్ల ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో నెల క్రితం పంపిణీ చేశారు. ప్రస్తుతం కట్టుకోవద్దని చెప్పారు. క్లాత్‌ నాణ్యత అసలు బాగోలేదు.

– డి.శాంతమణి,

సీఐటీయూ జిల్లా కార్యదర్శి, పల్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement