చలో విజయవాడకు అనుమతిలేదంటూ ఆంక్షలు శాంతియుత నిరసనకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్న సచివాలయ ఉద్యోగులు
డిమాండ్ల పరిష్కారం కోరడం నేరమా?
సత్తెనపల్లి: గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించడం, ప్రభుత్వ సేవలు ఇంటి వద్దకే తీసుకొచ్చేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ వ్యవస్థకు నాంది పలికారు. కానీ టీడీపీ పాలనలో ప్రజలకు సేవల సంగతి అటుంచి, సచివాలయ ఉద్యోగులను వేధించటం, బెదిరించడమే లక్ష్యంగా వ్యవహారం సాగుతోంది. కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు విఫలయత్నం చేస్తూనే ఉన్నారు. తాజాగా సచివాలయ ఉద్యోగులు న్యాయమైన డిమాండ్ల సాధనకు చలో విజయవాడ పేరుతో నిరసన తెలిపేందుకు పిలుపునిచ్చిన క్రమంలో స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ఆదివారం పయనం కాగా పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించటమే కాక వారిని గృహ నిర్బంధించారు. కొందరు సచివాలయ ఉద్యోగులను శనివారం అర్ధరాత్రి నుంచే హౌస్‌అరెస్ట్ చేయగా మరి కొందరిని ఆదివారం విజయవాడ వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు నిలిపి వేశారు. ఎక్కడికక్కడ పోలీసుల ద్వారా ఆంక్షలు విధించారు. సచివాలయ ఉద్యోగులకు హెచ్చరికలు చేస్తూ విజయవాడ ఆందోళన కార్యక్రమానికి వెళ్లడానికి అనుమతి లేదని, కాదని వెళితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు చేశారు. ఎంతమందిని ముందస్తు అరెస్టులు చేశారు, ఎంత మందిని గృహ నిర్బంధం చేశారనే విషయాన్ని కూడా పోలీసులు గోప్యంగా ఉంచారు.
సచివాలయ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్న నన్ను గృహ నిర్బంధం చేయడం ఎంతవరకు సమంజసం? గృహనిర్బంధాలతో మా గళాన్ని అణచలేరు. ఉద్యమాన్ని ఆపలేరు. మేం న్యాయమైన డిమాండ్ల పరిష్కారం మాత్రమే కోరుతున్నాం. ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించాలి. ప్రజాస్వామ్యంలో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం తప్పా? నేను సచివాలయ ఉద్యోగుల సంఘం నాయకుడిగా పోరాడుతున్నా. పోలీసులు ఇలా గృహ నిర్బంధం చేయడం తగదు.
– చిలుకా ప్రదీప్, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఐక్యవేదిక అధ్యక్షుడు, సత్తెనపల్లి


