నాయకుల మధ్య ఆధిపత్య పోరు స్థలానికి రూ.కోట్ల ధర పలకడంతో వివాదం గౌడ సంఘంలో, పార్టీలో పెత్తనం కోసం కత్తితో దాడి నిందితుడు, బాధితుడు.. ఇద్దరూ ఎమ్మెల్యే యరపతినేని అనుచరులే
పిడుగురాళ్ల: స్థల వివాదంలో టీడీపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండగానే ఒకరిపై మరొకరు కత్తితో దాడి చేశారు. గౌడ సంఘంలో నాలుగు ఎకరాల స్థలం కోసం సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్షుడి మధ్య వివాదం చెలరేగింది. ఇది చినికి చినికి గాలివానలా మారి కత్తులతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఇద్దరూ టీడీపీలో నాయకులుగా వ్యవహరిస్తూ, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు అనుచరులుగా ఉన్నారు. వీరిలో ఒకరు ఇసుక వ్యాపారం చేస్తున్నారు. మరొకరు టీఎన్‌టీయూసీ అధ్యక్షుడిగా పిడుగురాళ్ల పట్టణంలో కొనసాగుతున్నారు.
స్థలం ధర అమాంతం పెరగడంతో...
పిడుగురాళ్ల పట్టణంలో ఖలీల్ దాబా వద్ద కొన్నేళ్ల క్రితం గౌడ సంఘం కులం కోసం చందాలు వసూలు చేసిన యడవల్లి ప్రార్థన, అతని కుమారులు శ్రీనివాసరావు (ఇసుక శ్రీను), అప్పారావులు నాలుగు ఎకరాలు కొనుగోలు చేశారు. ఆ స్థలం రిజిస్ట్రేషన్‌కు సమస్య ఏర్పడుతుందని, ఎవరో ఒకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటే బాగుంటుందని సంఘం పెద్దలు అనుకున్నారు. వెంటనే ప్రార్థన, అతని కుమారుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ మధ్యకాలంలో ఆ ప్రాంతంలో వెంచర్లు, రహదారులు, ప్రైవేట్ విద్యాసంస్థలు ఏర్పడటంతో స్థలానికి రూ.కోట్లలో ధర పలుకుతోంది. ప్రార్థన, అతని కుమారుల వద్దకు గౌడ సంఘం పెద్దలు వెళ్లి స్థలం గురించి అడిగారు. వారు మాత్రం అది తమదని, అందులో కొంతమంది మాత్రమే గౌడ సంఘం వారు ఉన్నారని, వారికి మాత్రమే స్థలాలు ఇస్తామని పేర్కొన్నారు. మిగిలిన భూమి అంతా తమదేనని వారు అన్నట్లు తెలియవచ్చింది. దీంతో కొంతకాలంగా వారికి, గౌడ సంఘం పెద్దలకు వివాదం నడుస్తూ ఉంది.
కత్తితో దాడి వరకు వెళ్లిన గొడవ
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యడవల్లి శ్రీనివాసరావు ఆ పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే యరపతినేనికి సన్నిహితుడిగా మారాడు. యరగాని వెంకట్ (లడ్డూ) కూడా టీఎన్‌టీయూసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ, గౌడ సంఘం అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యాడు. ఏళ్ల తరబడి ఉన్న ఈ స్థల వివాదాన్ని పరిష్కరించాలని లడ్డూ ఎప్పటి నుంచో చర్చలు జరుపుతున్నాడు. కొన్నిసార్లు వాదనకు దిగినట్లు తెలిసింది. దీంతో తమ స్థలం విషయంలో అడ్డుగా వస్తున్న లడ్డూను ఏదో ఒకటి చేయాలని శ్రీనివాసరావు పన్నాగం పన్నాడు. వెంకట్ వచ్చే వచ్చే మార్గాన్ని రెక్కీ నిర్వహించి ప్రార్థన, అతని కుమారులు శ్రీనివాసరావు, అప్పారావు, మరో ఇద్దరు కలిసి శనివారం రాత్రి అతని ఇంటి వద్ద కాపు కాశారు. శ్రీనివాసరావు కత్తితో వెంకట్ మెడపై, ఛాతీ పక్కన, మరో చోట దాడి చేశాడు. కొంతమంది వ్యక్తులు వెంకట్‌ను గుంటూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేర్చారు. స్థల వివాదంతోపాటు గౌడ సంఘం, టీడీపీలో ఆధిపత్యం కోసం గొడవలు జరుగుతూనే ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వద్దకు పంచాయితీ చేరిందని తెలిసింది. పరిష్కరించక సాగదీయడమే హత్యాయత్నం వరకు వెళ్లిందని భావిస్తున్నారు. సీఐ శ్రీరాం వెంకట్రావు మాట్లాడుతూ... ఆస్పత్రి నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్‌ఐ శివనాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.


