మంగళగిరి రూరల్: మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూఏపీఎల్)లో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్ అమరావతి ఈ చాంపియన్స్ టీంకు రాయలసీమ జెన్ స్టార్స్ మధ్య జరిగింది. మ్యాచ్లో ‘అమరావతి ఈ చాంపియన్స్’ ఏడు వికెట్ల తేడాతో రెండో విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన అమరావతి ఈ చాంపియన్స్ టీం 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. రంగలక్ష్మి 50, అనూష 46, కాట్రగడ్డ దీక్ష 48 పరుగులతో రాణించారు. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయలసీమ జెన్ స్టార్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 156 పరుగులు మాత్రమే చేసింది. అమరావతి బౌలర్లలో సాయి పూజిత 4, కాండ్రేగుల దేవిక 2 వికెట్లు పడగొట్టారు. 22 బంతుల్లో 48 పరుగులు చేసిన కాట్రగడ్డ దీక్షకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలోని లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో సోమ వారం నుంచి ఈ నెల 24వ తేదీ వరకు వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం అకల్మష హోమం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు విష్వక్సేనారాధన, అఖండ దీపారాధన, ఋత్విగ్వరణం, నవ కుంభారోపణ కార్యక్రమాలు జరుగుతాయి. పవిత్రోత్సవాల సందర్భంగా ప్రతి రోజూ నిర్వహించే ప్రత్యేక పూజలు, హోమాలు, గ్రామోత్సవాల్లో భక్తులు పాల్గొని స్వామి వారి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకోవాలని దేవస్థానం సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ కోరారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు.
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని వైఎస్సార్ సెంటర్లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జన వేడుకలను ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కమిటీ సభ్యులతోపాటు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్), పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి, రెడ్డి ల్యాబ్స్ అధినేత, ఏఆర్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కళ్ళం సుబ్బారెడ్డి, వైఎస్సార్ అండ్ కేవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేతలు కళ్లం రాజశేఖరరెడ్డి, కళ్లం చంద్రశేఖరరెడ్డి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం తాడేపల్లి పట్టణానికి చెందిన పమిడిమళ్ల వెంకటరామిరెడ్డి మనువడు నాగనితిన్ రెడ్డి అందజేసిన 36 కేజీల లడ్డూ వేలంపాట నిర్వహించారు. కళ్లం సుబ్బారెడ్డి రూ.6.35 లక్షలకు లడ్డూ దక్కించుకున్నారు. లడ్డూను కమిటీ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు ఆయనకు అందజేశారు. నిమజ్జన కార్యక్రమం సంప్రదాయంగా మహిళలతో కోలాటం, కేరళ డప్పులతో ఉత్సాహంగా సాగింది. తొలుత దాదాపు ఆరువేల మందికి అన్నదానం నిర్వహించారు.
ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశ పరీక్ష ఆదివారం సజావుగా సాగిందని కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు, పరీక్షల కోఆర్డినేటర్ ప్రొ.దిట్టకవి రామచంద్రన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 14 కేంద్రాలలో 822 మంది రిజిస్ట్రేషన్ చేయించుకోగా, 782 మంది పరీక్షకు హాజరైనట్లు చెప్పారు. 22వ తేదీన సాయంత్రం ఫలితాలను విడుదల చేస్తామన్నారు. వర్సిటీలో ఉన్న పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ పి.కృష్ణవేణి, సూపరింటెండెంట్ జె శ్రీనివాసరావు, సీనియర్ అసిస్టెంట్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


