గత రెండున్నర నెలలుగా ఖాళీగా ఎస్పీ పోస్టు జిల్లా ఏర్పడిన తరువాత ఆరో ఎస్పీగా నియామకం
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లాగా జగదీశ్ అదహళ్లిని నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన జగదీశ్ ప్రస్తుతం సీఎం సెక్యూరిటీ వింగ్‌లో పనిచేస్తున్నారు. కర్నాటక రాష్ట్రానికి చెందిన ఈయన గతంలో పాడేరు, అల్లూరి జిల్లాలలో అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో ఎస్పీగా పనిచేసిన బి. కృష్ణారావు ఇక్కడి నుంచి కేంద్ర సర్వీసులకు రెండున్నర నెలల కిందట వెళ్లినప్పటి నుంచి ప్రభుత్వం కొత్త ఎస్పీని నియమించలేదు. బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ ఇప్పటి వరకు ఇన్‌చార్జి ఎస్పీగా వ్యవహరించారు. పల్నాడు జిల్లా ఏర్పడిన తరువాత జగదీశ్ ఆరో ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే ఐదుగురు ఎస్పీలు మారడం విశేషం. శాంతిభద్రతల పరంగా ఎంతో సున్నితమైన పల్నాడు జిల్లా ఎస్పీ పోస్టు భర్తీలో ప్రభుత్వం ఆలస్యం చేయడంపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. జిల్లాకు పూర్తిస్థాయిలో ఎస్పీ లేకపోవడంతో గత కొంతకాలంగా హత్యలు, దొంగతనాలు, అల్లర్లు, ఇతర నేరాలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా అధికారపార్టీ నేతలు సత్తెనపల్లి, చిలకలూరిపేట తదితర ప్రాంతాల్లో పేకాట క్లబ్బులు విచ్చలవిడిగా నిర్వహిస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. కొత్త ఎస్పీ వీటిపై దృష్టి పెట్టాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.
దుగ్గిరాల: ప్రకాశం బ్యారేజ్ నుంచి పశ్చిమ డెల్టాకు శనివారం 3,506 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు.


