చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి

Sep 21 2026 6:35 AM | Updated on Sep 21 2026 6:35 AM

చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి

శ్రీ అభయాంజనేయ స్వామికి 101 కొబ్బరికాయలు కొట్టిన డాక్టర్‌ గోపిరెడ్డి, నాయకులు శ్రీవారి ప్రసాదంపై నిందలతో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ పతనం ప్రారంభమైందని వ్యాఖ్య

నరసరావుపేట: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూ ప్రసాదంపై వేసిన నిందలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లు రాష్ట్ర ప్రజలకు, దేశవ్యాప్తంగా ఉన్న దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తులకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్‌ చేశారు. లడ్డూ ప్రసాదంలో ఎటువంటి జంతువుల కొవ్వు, ఇతర కెమికల్స్‌ కలవలేదని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చేసిన ప్రకటనపై ఆయన స్పందించారు. ఇకనైనా కూటమి నాయకులు క్షమాపణలు చెప్పాలని ఆదివారం రెడ్డినగర్‌లోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి 101 కొబ్బరికాయలు కొట్టారు. తర్వాత స్వామి వారిని దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించారు.

సీఎంకు సద్బుద్ధి ప్రసాదించు స్వామీ...

ఈ సందర్భంగా డాక్టర్‌ గోపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, బాత్రూం కెమికల్స్‌ కలిశాయని నిందలు వేసిన చంద్రబాబు నాయుడికి సద్బుద్ధి ప్రసాదించాలని దేవుడిని ప్రార్థించామన్నారు. ప్రజలకు అబద్ధాలు చెప్పకుండా ఆయన నోరు మూయించాలని శ్రీ వెంకటేశ్వరస్వామిని వేడుకున్నామని పేర్కొన్నారు. ప్రసాదంపై వారు వేసిన నిందలన్నీ అబద్ధాలని ఈడీ ప్రకటనతో స్పష్టమైందన్నారు. ఇప్పటిౖకైనా వారు చెంపలు వేసుకుని భగవంతుడికి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసినందున ఇద్దరూ కాలినడకన తిరుమల చేరుకుని భగవంతుడిని క్షమాపణ కోరాలని పార్టీ తరఫున తాను డిమాండ్‌ చేసున్నట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎటువంటి తప్పులు చేయలేదని సాక్షాత్తూ ఆ వెంకటేశ్వర స్వామే ఈడీ రూపంలో ప్రజలకు తెలియజేశారని వ్యాఖ్యానించారు. శ్రీ వెంకటేశ్వర స్వామిపై నిందలు వేసినవాళ్లు పతనం అవుతారని, కూటమి ప్రభుత్వ పతనం కూడా ప్రారంభమైందని తెలిపారు. కూటమి మళ్లీ అధికారంలోకి రాదని పేర్కొన్నారు. కూటమి నేతలకు ఆ దేవదేవుడు తగిన విధంగా బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement