ఎస్‌ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
15 నుంచి 29వ తేదీ వరకు షెడ్యూల్
29న నూతన కమిటీ ఏర్పాటు
గ్రామాల్లో వేడెక్కనున్న రాజకీయం
తల్లిదండ్రుల వివరాల సేకరణలో నేతలు నిమగ్నం
జిల్లాలో 15,056 ప్రభుత్వ
యాజమాన్య పాఠశాలలు..
1.36 లక్షల మంది విద్యార్థులు
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన డీఈవో
నరసరావుపేట ఈస్ట్: పాఠశాలల ఎన్నికల నగారా మోగింది. పాఠశాలల్లో రెండేళ్ల కిందట ఏర్పడ్డ పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 15 నుంచి 29వ తేదీ నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయించింది.
నేతల ఏర్పాట్లు
స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ విడుదల కావటంతో గ్రామాల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజకీయ పక్షాలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. గ్రామాల వారీగా ఓటర్ల జాబితా పరిశీలనలో ఉన్న నేతలు ఒక్కసారిగా బడి ఎన్నికలకు అధికారులు షెడ్యూల్ విడుదల చేయటంతో పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వివరాలు సేకరించటంలో బిజీగా మారారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 ఆగస్ట్ 8వ తేదీన ఎన్నికలు నిర్వహించారు. రెండేళ్ల కాల పరిమితితో అప్పట్లో ఏర్పాటైన కమిటీల పదవీ కాలం పూర్తయి నెలరోజులకు పైగా కావటంతో పాఠశాల విద్యాశాఖ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇప్పుడు ఏర్పడే కమిటీలు రెండేళ్లపాటు పదవిలో ఉండనుండటంతో నేతల దృష్టి పాఠశాలలపై పడింది. బడుల అభివృద్థి, విద్యార్థులకు అందించే సంక్షేమ పథకాలు అమలులో కమిటీల పాత్ర కీలకంగా మారటంతో కమిటీల చైర్మన్, వైస్ చైర్మన్, ఇతర పదవుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికే నేతల నుంచి మాట తీసుకున్నట్టుగా చెబుతున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా 12 నుంచి 25 మంది వరకు సభ్యులను ఎన్నుకొనే అవకాశం ఉంటుంది. పాఠశాలల్లో వంద మంది విద్యార్థులు ఉంటే 12 – 15, వంద నుంచి ఐదు వందల మంది లోపు ఉంటే 15– 20, ఐదు వందల మందికిపైగా విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో 25 మంది సభ్యులను ఎన్నుకుంటారు. జిల్లాలో 2,077 బడులు ఉండగా, వాటిలో ప్రభుత్వ యాజమాన్యంలో 15,056 ఉన్నాయి. వీటిలో 1.36 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ పాఠశాల నిర్వహణ కమిటీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి ిపీవీజే రామారావు మంగళవారం వివరాలు ప్రకటించారు. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నోటీస్ బోర్డులో ఎస్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రదర్శించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ నెల 15వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, 18వ తేదీన ఓటర్ల జాబితా విడుదల, జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి ఈ నెల 25వ తేదీన తుది జాబితాను నోటీస్ బోర్డులో ప్రకటిస్తారన్నారు. అలాగే ఈ నెల 29వ తేదీన ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సభ్యుల ఎన్నిక ఉంటుందని తెలిపారు. ఫలితాలు ప్రకటించి మధ్యాహ్నం 1.30 గంటలకు చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక, ప్రమాణ స్వీకారం, 3 గంటలకు తొలి సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా మండల విద్యాశాఖాధికారులు, ఉప విద్యా శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రైవేటు బడుల యాజమాన్యాలు సైతం ఎన్నికల నిర్వహించేలా ప్రోత్సహించాలని కోరారు.


