రొంపిచర్ల /ఈపూరు: ట్రావెల్స్ బస్సు ఢీకొని ఇరువురు యువకులు మృతి చెందిన దుర్ఘటన శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్‌ప్రెస్ వేపై సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.... ఈపూరు మండలం ఇనిమెళ్ళ గ్రామానికి చెందిన నడికోట రామాంజనేయులు(38), పాలవెల్లి వెంకటాంజనేయులు (36) వినాయక చవితి సందర్భంగా విగ్రహం కోసం బైక్ మీద నరసరావుపేటకు వెళుతున్నారు. ఈ క్రమంలో స్థానిక కరెంట్ ఆఫీస్ వద్ద హైవే రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుంచి కందుకూరు వైపు వెళుతున్న ట్రావెల్స్ బస్సు ఢీకొంది. కొద్దిదూరం లాక్కొని వెళ్లింది. బైక్ నడుపుతున్న రామాంజనేయులు, వెనుక కూర్చొని ఉన్న వెంకటాంజనేయులు కింద పడిపోవడంతో తలలకు తీవ్ర గాయాలు అయ్యాయి. కాళ్ళు, చేతులు నుజ్జు నుజ్జు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ట్రావెల్స్ బస్సు డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. ట్రావెల్స్ బస్సును పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లోకేశ్వర్ రావు తెలిపారు.
కన్నీరుమున్నీరైన బాధిత కుటుంబాలు
వినాయక చవితి వేడుకల కోసం ఆనందంగా బయలుదేరిన వారు మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పండుగ ఏర్పాట్లతో సందడిగా ఉండాల్సిన ఇళ్లలో విషాదం నెలకొంది. వెంకటాంజనేయులుకు భార్య త్రివేణి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. గ్రామంలో పొలం కౌలుకు తీసుకుని సాగు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబం పెద్ద దిక్కు కోల్పోవడంతో మిగతావారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రామాంజనేయులుకు భార్య కోటేశ్వరమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తనకున్న మూడు ఎకరాల పొలాన్ని సాగు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. తండ్రికి సాయంగా పొలం పనులలో చురుకుగా ఉండేవాడని స్థానికులు తెలిపారు. అండగా ఉంటాడునుకున్న కొడుకు విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి తండ్రి గుండెలవిసెలా విలపించాడు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. రెండు కుటుంబాల వేదన చూసిన వారు కంటతడి పెట్టుకున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలకు స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇదే గ్రామానికి చెందిన ముగ్గురు నెల రోజుల క్రితం విశాఖపట్నంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
బస్సు కింద పడి యువకుడు మృత్యువాత
కారంచేడు: యువకుడి మృతితో పండగ పూట మరో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఎస్‌ఐ షేక్ ఖాదర్‌బాషా కథనం మేరకు.. పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలోని లింగంగుంట్ల ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది ద్విచక్రవాహనాలపై చీరాల సమీపంలోని వాడరేవు బీచ్‌కు వచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బీచ్‌లో సరదాగా గడిపి తిరుగు ప్రయాణమయ్యారు. వారిలో ఒకడైన బొజ్జా బాలకోటయ్య (27) తన బైక్‌పై వెళ్తూ... చీరాల నుంచి షాపూర్ వస్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సును ఓవర్ టేక్ చేయబోయాడు. బస్సుకు ద్విచక్రవాహనం హ్యాండిల్ తగలడంతో బైక్ అదుపుతప్పి పడిపోయింది. బండితోపాటు, బాలకోటయ్య బస్సు కింద పడిపోయాడు. తల మీదుగా బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఆసుపత్రికి పంపించారు.


